Dog Nanny: రోజంతా పనిచేస్తే రూ.1000 కూడా గిట్టుబాటు కాని రోజులివి. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన తరువాత ప్యాకేజీల రూపంలో వేతనాలు పెరిగాయి కానీ.. నెలంతా కష్టపడితే రూ.30 వేలు కూడా దాటని పరిస్థితి ఉండేది. సాఫ్ట్ వేర్ పుణ్యమా అని యువత లక్షల రూపాయల వేతనం కళ్లజూస్తున్నారు. అయితే ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు.. తమ తెలివితేటలు, నైపుణ్యం చూపిస్తే కానీ అక్కడి ఉద్యోగాల్లో కుదురుకోలేరు. అటువంటిది ఓ కుక్కను పెంచితే కోటి రూపాయల వార్షిక వేతనం వస్తుందంటే క్యూకడతారు కదూ. సాఫ్ట్ వేర్ రంగం కంటే ఎక్కువగా ఇష్డపతారు కదూ. లండన్ లో ఇటువంటి ప్రకటనే ఒక బిలీనియర్ నుంచి రావడంతో వందలాది దరఖాస్తులు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం బయటకు వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లండన్ కు చెందిన ఓ బిలీనియర్ తన పెంపుడు కుక్కను పెంచేందుకు పనిమనిషి కావాలని ప్రకటన ఇచ్చాడు. ఏడాదికి కోటి రూపాయల వేతనం ప్రకటించాడు. ఎంపికైన వారికి 42 రోజుల పాటు సెలవు దినాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు. కుక్కతో పాటు ఎక్కడికైనా వెళ్లేందుకు జెట్ విమాన సౌకర్యం ఉంటుందని తెలిపాడు. దీంతో ఆన్ లైన్ లో వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల పెట్ సంస్కృతి పెరిగింది. ప్రతి ఇంటా పెంపుడు కుక్కలు దర్శనమిస్తున్నాయి. ఆర్థిక స్థితిమంతుల గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ ప్రఖ్యాతి బ్రాండెడ్ కుక్కలను పెంచుతున్నారు. నట్టింట వాటిని చూసి మురిసిపోతున్నారు. వాటి కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడడం లేదు. లండన్ బిలీనియర్ కూడా అట్టే భావించాడు. కుక్కల పెంపకంపై అవగాహన, వాటితో మమేకం అయ్యేవారిని పనిమనిషిగా ఎంపిక చేయనున్నట్టు చెబుతున్నాడు. సో ఆ కోటి రూపాయలు వేతనం దక్కించుకునేందుకు ఎంతో మంది నిరుద్యోగ యువత పోటీపడుతున్నారు. మరి ఆ అరుదైన కొలువు ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరీ.