Ayodhya Ram Mandir : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల 500 ఏళ్ల నాటికల అయోధ్య రామ మందిర నిర్మాణం మరో మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. జనవరి 22న బాలరాముడు విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. మరోవైపు రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రత్యేక పూజలు జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి 33 కోట్ల దేవతలను ఆహ్వానిస్తూ 1008 హోమ గుండాలతో 1008 మంది రుత్వికులు యాగం నిర్వహిస్తున్నారు.
7 వేల మందికి ఆహ్వానాలు..
అయోధ్య రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 7 వేల మందికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆలయ ప్రారంభోత్సవం కోసం చేసిన ఏర్పాట్లతో అయోధ్య ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోంది.
అతిథులను ఆకట్టుకునేలా డ్రోన్ షో..
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిధులను ఆకట్టుకునేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ నిర్వహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్రస్ట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయోధ్య వైపే ప్రపంచం చూపు..
ఇదిలా ఉండగా 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రపంచం దృష్టంతా ఇప్పుడు అయోధ్య నగరం వైపు మళ్లింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయంగా అయోధ్య రామాలయం నిలువనుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జనవరి 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు రామ్ లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంది. గురువారం గర్భాలయంలో ప్రతిష్టించారు. ఈ ఫోటోలు కూడా విడుదల అయిన నేపథ్యంలో భక్తులందరూ చూసి తరించారు. తాజాగా అక్కడ నిర్వహించిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంటుంది.