Allu Arjun : అల్లు అర్జున్ ఔదార్యానికి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. మా హీరోది అంత గొప్ప మనసు అంటూ కాలర్ ఎగరేస్తున్నాడు. అల్లు అర్జున్ తన కారు డ్రైవర్ కి చేసిన సహాయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న డ్రైవర్ కి అల్లు అర్జున్ లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వరంగల్ కి చెందిన మహిపాల్ పదేళ్లుగా అల్లు అర్జున్ దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తున్న మహిపాల్ అంటే అల్లు అర్జున్ కి ప్రత్యేక అభిమానం. ఈ క్రమంలో మహిపాల్ బోరబండలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మహిపాల్ కి రూ. 15 లక్షల చెక్ అందించారు.

ఏళ్లుగా హైదరాబాద్ లో కుటుంబంతో పాటు మహిపాల్ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తన సంపాదనలో కొంత మొత్తం దాచుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి తన వంతు సాయంగా అల్లు అర్జున్ కొంత మొత్తాన్ని ఇచ్చి ఆదుకున్నాడు. తన వద్ద పని చేసే సిబ్బందిని అల్లు అర్జున్ సొంత మనుషుల్లా చూస్తారు. వాళ్ళ పుట్టినరోజులు ప్రత్యేకంగా జరపడం, ఆయన పాల్గొనడం చేస్తారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ పర్సన్స్ లో ఒకరు ఆయన చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు.
అలాగే అల్లు అర్జున్ కేరళకు చెందిన ఒక నర్సింగ్ విద్యార్థిని దత్తత తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆ విద్యార్థిని తండ్రి మరణించాడు. దీంతో ఫీజులు చెల్లించి చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక కలెక్టర్ ద్వారా అల్లు అర్జున్ కి ఈ విషయం చేరింది. ఆ విద్యార్థిని చదువు పూర్తి అయ్యే వరకు మొత్తం బాధ్యత అల్లు అర్జున్ తీసుకున్నారు. ఆమె ఫీజులు, హాస్టల్ చార్జెస్ తో పాటు ఇతర ఖర్చులు స్వయంగా భరిస్తానని ఒప్పుకున్నారు.
మరోవైపు పుష్ప 2 కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కారణంగా లేటైందని తెలుస్తుంది. పార్ట్ 1 భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో మరింత గ్రాండ్ గా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం రూ. 300 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. పుష్ప 2 ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు.


