Chandrababu Kuppam: ఇప్పటి వరకు ఆయనకు ఆ నియోజకవర్గంలో ఓటమే లేదు. అధికార పార్టీ మాత్రం ఓటమి రుచి చూపిస్తామని శపథం చేసింది. చతురంగ బలాలను మోహరిస్తోంది. ప్రతిపక్ష నేతను ఉక్కిబిక్కిరి చేస్తోంది. ఇన్నేళ్లు చుట్టుపు చూపుగా వెళ్లిన ప్రతిపక్ష నేతకు తర్కం బోధపడినట్టుంది. పండగకో.. పబ్బానికో కాకుండా సొంత నియోజకవర్గానికే మకాం మార్చారు. పార్టీ నేతలందరికీ అక్కడి నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయనెవరో కాదు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి కుప్పానికి మకాం మార్చారు. తెలుగుదేశం నేతలందరినీ అక్కడికే రమ్మని చెబుతున్నారు. అక్కడే సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం కుప్పం టార్గెట్ గా వైసీపీ పనిచేస్తూ ఉండటమే. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని వైసీపీ శపథం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించి చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఇదే రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకింత కలవరానికి గురయ్యారనే చెప్పాలి. కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటంలేదు. దీంతో టీడీపీ అధినేత కుప్పం కేంద్రంగా రాజకీయం చేయడం మొదలెట్టేసారు.
నారా లోకేష్ పాదయాత్ర త్వరలో ప్రారంభం అవుతుంది. ఇది కూడ కుప్పం నుంచే మొదలవుతుంది. ఈనెల 27 నుంచి 400 రోజులు.. 4000 కిలో మీటర్లు `యువగళం` పేరుతో లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇంచార్జీలందరూ కుప్పం రావాలని అధినేత ఆదేశించారు. జీవో నెంబర్ 1, కోర్టు తీర్పు, ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేయడం వంటి అంశాల పై నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పాదయాత్ర విజయవంతం అయ్యేలా చంద్రబాబు దగ్గరుండి దిశా నిర్దేశం చేస్తున్నారు.

వైసీపీ శపథంతో టీడీపీ దారులన్నీ కుప్పం వైపు మళ్లాయని చెప్పవచ్చు. వైసీపీ పప్పులు కుప్పంలో ఉడకనీయకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. కుప్పంలో ఓడిస్తే రాష్ట్రమంతా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం వైసీపీకి ఇవ్వకూడదనే టీడీపీ అధినేత భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం గెలవడం టీడీపీకి చారిత్రక అవసరం. ఓడిపోతే అది పార్టీనే దెబ్బతీస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు వ్యూహాత్మకంగా కుప్పంలో అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. కుప్పం వెళ్లిన ప్రతిసారి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని చెప్పవచ్చు.