https://oktelugu.com/

Air India Recruitment Drive : ఉన్నది 2000 పోస్టులు.. వచ్చింది 25,000 మంది.. ఓరయ్యా ఇంత మందికి ఉపాధి లేదా?

ముంబై విమానాశ్రయానికి బుధవారం భారీగా యువకులు రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతమంది జనం విమానాశ్రయానికి ఎందుకు వచ్చారా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే ఆ స్థాయిలో వచ్చిన యువకులను నియంత్రించలేక విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు

Written By:
  • Bhaskar
  • , Updated On : July 17, 2024 5:04 pm
    Follow us on

    Air India Recruitment Drive : “ఓ చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో ఖాళీ పొట్ట పట్టుకుని తిరుగుతున్నాం.. ఉన్న ఊళ్లో ఉపాధి లేదు.. చేద్దామంటే ఉద్యోగం లేదు.. బయటికి వెళ్తే ఎవరూ లెక్క చేయడం లేదు. ఇంట్లో వాళ్లకు భారంగా బతుకుతున్నాం.. మాలాంటి యువతే ఈ దేశానికి చోదక శక్తి అంటారు కదా.. మా శక్తికి సరైన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా.. ప్రభుత్వం మాకు ఎందుకు ఉద్యోగాలు కల్పించదు? మేం కడుతున్న పన్నులు ఎక్కడికి పోతున్నాయి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఇలా అయితే మేము ఎలా బతకాలి.. ఏం చేసి బతకాలి” అప్పట్లో శ్రీహరి నటించిన ఓ సినిమాలో ఫేమస్ అయిన డైలాగులు ఇవి. నాటి రోజులే కాదు.. నేటి రోజులకు కూడా ఇవి నూటికి నూరు శాతం సరిపోతాయి. ఎందుకంటే చదివేవారు ఎక్కువైపోయి.. ఉద్యోగాలు తక్కువ కావడంతో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కూడా ఉద్యోగ ప్రకటనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో చాలామంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పే సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో చోటుచేసుకుంది.

    2000 పోస్టులకు

    ముంబై విమానాశ్రయానికి బుధవారం భారీగా యువకులు రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతమంది జనం విమానాశ్రయానికి ఎందుకు వచ్చారా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే ఆ స్థాయిలో వచ్చిన యువకులను నియంత్రించలేక విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఆ ఉద్యోగాలు దక్కించుకునేందుకు చాలామంది యువకులు విమానాశ్రయానికి వచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.. ఎయిర్ ఇండియా 2,216 ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబై విమానాశ్రయంలో మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. దీనికోసం భారీగా నిరుద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఎయిర్ ఇండియా ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద సంబంధిత పత్రాలు సమర్పించేందుకు పోటీపడ్డారు. ఈ సమయంలో ఒకరిని ఒకరు తోసుకున్నారు. సమయానికి నీరు లభించక, ఆహారం అందక చాలామంది ఇబ్బంది పడ్డారు. కొందరైతే ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ ఇండియా లోడర్ పోస్టుల కోసం ఈ డ్రైవ్ నిర్వహించింది.

    లోడర్ పోస్టులంటే

    విమానాశ్రయంలో లోడర్ గా పనిచేసేవారు.. విమానం నుంచి వచ్చిన లగేజీ దించడం, ఎక్కించడం, బ్యాగేజీ బెల్ట్ లను సరి చూసుకోవడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో విమానంలో లగేజీ, కార్గో చూసుకునేందుకు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. వారికి నెలకు 20 నుంచి 25వేల వరకు జీతం అందిస్తారు. అయితే చాలామంది ఓవర్ టైం పని చేసి 30 వేల వరకు సంపాదిస్తుంటారు. అయితే ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. కాకపోతే అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండాలని ఎయిర్ ఇండియా నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.

    400 కిలోమీటర్ల నుంచి వచ్చారు

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారు. అంతేకాదు వారిలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇప్పటివరకు సరైన ఉద్యోగాలు లభించకపోవడంతో.. చాలామంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు..ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొంతమంది రాజస్థాన్ రాష్ట్రం నుంచి కూడా వచ్చారు..ఇక గతంలో గుజరాత్ రాష్ట్రంలోని అంక్లేశ్వర్ ప్రాంతంలో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూకి వచ్చిన కొంతమంది ఒకరినొకరు తోసుకోవడంతో రద్దీ వాతావరణం ఏర్పడింది.