Homeఎంటర్టైన్మెంట్Krishna : హీరో కృష్ణ మరణం: అన్న లేని లోటు తమ్ముడికే బాగా తెలుస్తుంది

Krishna : హీరో కృష్ణ మరణం: అన్న లేని లోటు తమ్ముడికే బాగా తెలుస్తుంది

Krishna : రాముడు అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే అన్న లేని లోటు తమ్ముడికే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. అన్నతో అంతటి అనుబంధం ఉంది కాబట్టి. గుండె పోటుతో హీరో కృష్ణ మరణించాడు. అతిరథ మహారథులు మొత్తం కృష్ణ కుమారుడు మహేష్ బాబు, అతని సోదరీమణులు, సోదరుడు రమేష్ భార్య, అతని పిల్లల్ని పరామర్శించారు. కృష్ణతో అనుబంధం ఉన్నవాళ్లు కంటనీరు పెట్టుకున్నారు. మోహన్ బాబు లాంటివారైతే కృష్ణ పార్థివదేహాన్ని చూసి భోరున విలపించారు. తండ్రి చనిపోయిన బాధ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ పెంపకంలో కనిపిస్తుంది. ఇందిర మంచాన పడ్డ తర్వాత, తాను విజయనిర్మలతో కలిసి ఉంటున్నా కూడా కృష్ణ కుటుంబం విషయంలో నిర్లక్ష్యం చూపలేదు. అందుకే అతడి మరణాన్ని తట్టుకోలేక రెండో కుమార్తె మంజుల బరువెక్కిన హృదయంతో ఒక లేఖ రాసింది. అది చదివినవాళ్లు కంటనీరు పెట్టుకున్నారు. ఈ ఏడాది మొదట్లో రమేష్ చనిపోయినప్పుడు.. కోడలు, మనవడు, మనవరాలిని కృష్ణ దగ్గరకు తీసుకున్నాడు. వారికి కావలసినవి చూసుకున్నాడు. ఇవాల్టికి కూడా రమేష్ భార్య మృదులకు, ఆమె పిల్లలకు హీరో కృష్ణ ఒక అండ. ఒక భరోసా. కుటుంబం అంటే ఎంతో ఇష్టపడే కృష్ణ ప్రతి సోమవారం పిల్లల్ని తన వద్దకే రప్పించుకునేవాడు. వాళ్ల వాళ్ల ఇంటి నుంచి ఐటమ్స్ వండుకొని తీసుకురావాలని చెప్పేవాడు. ఐటం పేరు కూడా తనే చెప్పేవాడు. అంతా కలిసి అక్కడే భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు కృష్ణ లేకపోవడంతో వీకెండ్ భోజనాలు ఉండవా అని మహేష్ కూతురు బాధగా పోస్ట్ చేయడం పలువురిని కంటతడి పెట్టించింది.

 

-ఆది శేషగిరిరావుకు కోలుకోలేని దెబ్బ

ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కంటే కూడా కృష్ణ సోదరుడి గానే ఆయన సుపరిచితం. రాముడికి లక్ష్మణుడిలా కృష్ణకు వెన్నంటే ఉండేవాడు. ఆపదలో, సంతోషంలో ప్రతిక్షణం కృష్ణతోనే ఉండేవాడు. కృష్ణకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని పర్యవేక్షించేవాడు. ఈయన కూడా వారి కుటుంబ సభ్యుడే.. ఈ దు:ఖ కాలంలో మిగతా వారి కంటే ఈయన కన్నీరే ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే ఒక అన్న లేని లోటు తమ్ముడికే ఎక్కువ తెలుస్తుంది. కృష్ణకు ఇద్దరు తమ్ముళ్లు.. ఆదిశేషగిరిరావు ఎక్కువ కనిపించేవారు.. హనుమంతరావు పెద్దగా ఫోకస్ ను కోరుకునేవారు కాదు. వీరిద్దరు కూడా కృష్ణకు రెండు భుజాలు.. ఆది శేషగిరిరావు పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు పర్యవేక్షించేవారు.

-కృష్ణను ఎదిరించారు

ఆదిశేషగిరిరావు మొదటి నుంచి కృష్ణను అంటిపెట్టుకొని ఉన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు ఆసుపత్రి పాలయ్యారు. ఇదే సమయంలో వేరే దర్శకుడికి అవకాశం ఇవ్వాలని కృష్ణ భావించారు. ఇదే విషయాన్ని ఆదిశేషగిరిరావుతో చెబితే ఆయన వద్దు అని వారించారు. “చేస్తే నువ్వే చెయ్. లేకుంటే ఇంకొకరు వద్దు” అని తేల్చి చెప్పారు. దీంతో ఆ చిత్రానికి కృష్ణనే దర్శకత్వం వహించారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆదిశేషగిరిరావు కన్నీటి పర్యంతమయ్యారు.

-ఆరోజు గురకపెట్టలేదు

కృష్ణకు గుండెపోటు వచ్చే ఆరోజు రాత్రి బాగానే ఉన్నారు.. శేషగిరిరావును తన వద్దకు పిలిపించుకొని చిన్ననాటి జ్ఞాపకాలు వేసుకున్నారు. సైకిల్ మీద ఆయనను సినిమాకి తీసుకెళ్లిన రోజుల నుంచి ప్రస్తుత సినిమాల పరిస్థితి వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సాయంత్రం అల్పాహారం తిన్నారు. రాత్రి కొద్దిగా భోజనం చేశారు.. తర్వాత పడుకున్నారు. కృష్ణకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంది. ఆరోజు గురక పెట్టక పోవడంతో కృష్ణను పర్యవేక్షించే అబ్బాయికి అనుమానం వచ్చి గుండె వేగాన్ని మిషన్ తో పరీక్షిస్తే ఎర్రర్ అని వచ్చింది. వెంటనే ఆ కుర్రాడు కంగారు పడి ఆది శేషగిరిరావు కు ఫోన్ చేశాడు. హుటాహుటిన కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే కృష్ణ ఆరోగ్యం క్షీణించింది. మరోసారి గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూసారు. కృష్ణ స్మారక భవనం నిర్మించే విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం కృష్ణ ఉంటున్న ఇంటిని స్మారకంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉండేది. కానీ ఆ ఇల్లు నరేష్ కు చెందుతుంది. పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ స్మారక భవనం, ఏర్పాటు చేయాలనే ఆలోచన కుటుంబ సభ్యుల్లో ఉంది. కృష్ణ మరణం మిగతా కుటుంబ సభ్యులకు ఎలా ఉన్నా శేషగిరిరావుకు మాత్రం లోటు. ఎందుకంటే రమేష్ ను చిన్నప్పుడు ఎత్తుకొని పెంచాడు. ఇందిరా దేవి సంరక్షణలో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాడు. ఇక కృష్ణతో అయితే తమ్ముడి కంటే ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఒకే ఏడాదిలో కన్నుమూయడం ఆది శేషగిరిరావు జీర్ణించుకోలేకపోతున్నాడు.” ఇప్పుడు నాకంటే మహేష్ బాబు ఎక్కువ బాధ పడుతున్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఓదార్చుకోవడం తప్ప చేసేది ఏమీ లేదని” ఆది శేషగిరిరావు అంటుండడం కన్నీరు తెప్పిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version