Visakhapatnam: వ్యసనాలు పచ్చని కుటుంబంలో చిచ్చు రేపుతున్నాయి. విచ్ఛిన్నానికి కారణం అవుతున్నాయి. విశాఖలో తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. వ్యసనాలకు బానిసైన ఓ డాక్టర్ ఏకంగా 70 లక్షల రూపాయలు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకు భార్యను వేధించాడు. అదనపు కట్నం కోసం హింసించాడు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. విశాఖలో సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
డాక్టర్ సాయి సుధీర్ అసిస్టెంట్ నెఫ్రాలజిస్ట్ గా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేవారు. 2009లో సత్యవాణి అనే మహిళతో డాక్టర్ సాయి సుధీర్ కు వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్నేళ్లపాటు వీరి దాంపత్యం సవ్యంగానే సాగింది. కానీ సాయి సుధీర్ జూదంతోపాటు మద్యానికి అలవాటయ్యాడు. విధులు సక్రమంగా నిర్వహించకుండా ఉండేవాడు. ఈ క్రమంలో 70 లక్షల రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. భార్య వద్దని వారించినా గొడవకు దిగేవాడు.
ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదురు కావడంతో.. అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. కన్నవారి ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని కోరేవాడు. ఇటీవల వేధింపులు అధికం కావడంతో సత్యవాణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సాయి సుధీర్ కుమారుడిని తీసుకొని పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయి సుధీర్ ని అదుపులోకి తీసుకున్నారు.