Vijay antony
Vijay Antony Daughter : సాగులో నష్టాలు.. కరువుకాటకాలు.. పెరిగిన అప్పులు.. తగ్గిన స్థైర్యం.. వెరసి ఇంటి దులానికో.. చెట్టుకొమ్మకో.. పురుగులమందు తాగో.. విగతజీవిగా అన్నదాత.. ఆ రైతు ఎన్ని ఆటుపోట్లను చూడలేదు. ఎన్ని కరువులను జయించలేదు? ఏటికి ఏ తం పెట్టి.. వెయ్యి పుట్లు పండించలేదు? మనోధైర్యం సడలి.. భయం ఆవహించి.. కట్టుకున్న ఇల్లాలిని.. నమ్ముకున్న పిల్లల్ని.. కష్టంలో పాలుపంచుకున్న కాడెడ్లను వదిలి.. ఇంత మందిని అనాథలను చేశాడు. తల్లిదండ్రులు కాయకష్టం చేసి చదివిస్తే.. పరీక్ష తప్పాడో విద్యార్థి. తోటి విద్యార్థుల ముందు చులకయ్యానన్న భయమో.. తల్లిదండ్రుల పరువు పోతుందన్న ఆందోళనో .. మొత్తానికి చావే పరిష్కారమనుకున్నాడు. తన జీవితానికి తాను “దీఎండ్ కార్డు” వేసుకున్నాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతూ.. పై రెండు ఉదాహరణలు ఇద్దరి వ్యక్తులవి.. రెండు కుటుంబాలవి.. ఇంకా చెప్పాలంటే వారినే నమ్ముకున్న కుటుంబ సభ్యులవి.. మంగళవారం ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె లారా(16) ఆత్మహత్య చేసుకుంది. ‘ వై మీ ’ అనుకోకుండా.. ‘ట్రై మీ’ అని ఆలోచించుకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో..
భయమే మూలం
భయమే సకల సమస్యలకు మూలం. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’.
సమస్య తీవ్రత ఒక్కశాతమే..
నిరుద్యోగం, వైఫల్యం, ఆర్థిక సమస్యలు.. ఏవైనా కావొచ్చు. సమస్య తీవ్రత ఒక్కశాతమే. మిగతా 99 శాతాన్నీ భయమే ఆక్రమిస్తుంది. భయం నీడలాంటిది. బెరుకు బెరుకుగా చూస్తున్నంత కాలం భూతమై వేధిస్తుంది. తీక్షణంగా వెలుగు ప్రసరింపజేస్తే తుస్సుమని మాయమైపోతుంది. సమస్య అనేది ఊహాత్మకం. ఉంది అనుకుంటే ఉన్నట్టు. లేదు అనుకుంటే లేనట్టు. చిన్నది అనుకుంటే చిన్నదే. తీవ్రమైంది అనుకుంటే తీవ్రమైందే. ఏ సమస్యా పరిష్కరించుకోలేనంత సంక్లిష్టమైనది కాదు. భయంతో మనిషి అచేతనుడు అవుతాడు. అతన్లోని ధైర్య సాహసాలు మట్టి కొట్టుకుపోతాయి. అర్జునుడు కూడా కురుక్షేత్ర మహాసంగ్రామంలో బిక్కచచ్చిపోయాడు. వణికిపోయాడు. కారణం యుద్ధం అంటే భయం. అయినవారితో పోరాడాలంటే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయం. కృష్ణుడు ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని ప్రసాదించానే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. శత్రువుల్ని చీల్చిచెండాడు.
ఆంజనేయుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు..
సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లాడు. ఆచూకీ బాధ్యత రాముడు ఆంజనేయుడికి అప్పగించాడు. హనుమంతుడు చెట్టు, పుట్టా అన్నీ గాలించాడు. ఎక్కడా సీతాదేవి ఆచూకీ దొరకలేదు. రాముడి తనపై ఉంచిన నమ్మకాన్ని. అప్పగించిన బాధ్యతను నిలబెట్టుకోలేకపోతున్నాన్న ఆందోళన.. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చాడు. చివరికి తనకు తానే సర్ది చెప్పుకుని ఆశోకవనం గాలించి సీతాదేవిని జాడ కనుక్కున్నాడు. చెట్టుకు వేరు.. సేద్యానికి ఎద్దు.. ఎంత ముఖ్యమో.. మనిషికి మానసిక ఆరోగ్యం కూడా అంతే..
భయాన్ని వీడండి..
భయాన్ని వీడితే జయానికి దగ్గరైనట్టే. ఇక ఉరితాడు కలల్లేవు. మెడనిండా ఆశావాదపు పూదండలే. ఇక పురుగులమందుల్లేవు, పాయసపు పరమాన్నాలే. ఇక నిద్రమాత్రల మత్తులేదు. నిత్యచైతన్య స్థితే. ఆ తేడా ఎవరికైనా స్పష్టంగా కన్పిస్తుంది. మునపట్లా నెత్తికొండను మోస్తున్నట్టు వంగిపోరు. అవసరమైతే అంతకంటే ధైర్యంగా పోరాడతారు. తప్పనిసరైతే గెలిచేదాకా ఓడుతూనే ఉంటారు. భయంలేని ఓటమి.ఓ గొప్ప గెలుపుపాఠం.
మానసిక ఒత్తిడిని జయించి..
మనిషి ఎంత బలంగానైనా ఉండొచ్చు.. మానసికంగా ఆరోగ్యంగా లేకుంటే అంతే.. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సిడ్నీషెల్డన్ తాను నవలలు రాయకముందు. మానసిక వ్యాధితో బాధపడేవారు. దాన్నుంచి బయటపడ్డాక ప్రపంచం కీర్తించేలా కథలు రాశారు. ఎన్నో రకాల బహుమతులు గెలుచుకున్నారు. బాలీవుడ్ నటీమణి దీపికాపదుకొణే కూడామెంటల్ స్ర్టెస్ బాధితురాలే… దాన్నుంచి విముక్తురాలయ్యేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. గదిలో ఒక్కతే ఉండేది. చిరాకు, కోపం, అనారోగ్యం ఇవన్నీ ఆమెకు బోనస్.. మెంటల్ స్ర్టెస్ నుంచి బయటపడ్డాక.. తనలాగా ఇంకేవరు బాధపడకూడదన్న ఆలో చనతో ఏకంగా ఓ ఎన్జీవో సంస్థను నెలకొల్పింది.
ఇవీ చేయండి..
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రేమతో దగ్గరగా తీసుకోండి. ఆత్మీయుల పరిష్వంగన ఎంతటి బాధనైనా మరిపిస్తుంది. ఏడ్వనీయండి గుండె తడి ఆరే దాకా.. మాట్లాడనీయండి గొంతు ఎండేదాకా.. ధైర్యం చెప్పండి..
ఏకాకైనా ఏకాకి కాదు.. మానసిక ఒత్తిడితో బాధపడేవారిని ఒంటరిగా ఉంచకండి.. మనలో ఒకడిగా గుర్తించండి.. మాటలో మాట కలపండి.. అతడి కంటూ విలువనీయండి.. తేడా మీరే చూస్తారు. దీని కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. రూ.లక్షలకు లక్షలు డాక్టర్లకు ఇవ్వాల్సిన పని లేదు. దీనికి పరిష్కారం మార్గం ఒక్కటే ఆత్మీయ పలకరింపు.. ఇదేమంతా ఖరీదైందా? ఆలోచించండి?
ధైర్య వచనాలు
నీ చర్మం కాగితం కాదు ముక్కలు చేయడానికి… నీ శరీరం ఎండు కర్ర కాదు కిరోసిన్‌తో తగలబెట్టేందుకు. నువ్వేం చెల్లని రూపాయి బిళ్లవు కావు రైలు పట్టాల మీద ప్రయోగాలు చేయడానికి.. నీ జీవితం సినిమా కాదు.. నీ అంతట నువ్వే ఎండ్ కార్డు వేసుకోవడానికి.. నువ్వో అత్యద్భుతమైన వ్యక్తివి. ప్రపంచంలో నీకంటే గొప్పవాళ్లు, సామాన్యులు ఉండవచ్చు. కానీ అచ్చంగా నీలాంటి వాడివి నువ్వొక్కడివే.. నిన్ను నువ్వు చంపుకొంటున్నావంటే.. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం లేదని అర్థం. ఇంకెవరో ప్రేమించడం లేదన్న ఫిర్యాదు ఎందుకు. నిన్ను నువ్వు ప్రేమించుకో.. ప్రపంచం మొత్తం నిన్ను ద్వేషించినా వచ్చిన నష్టమేమి లేదు. ఆత్మహత్య తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం. నిరుద్యోగం ఉద్యోగం వచ్చేదాకా ఇబ్బంది పెడుతుంది. అనారోగ్యం స్వస్థత చేకూరేదాకా వేధిస్తుంటుంది. ప్రేమ వైఫల్యం మరో ప్రేమ దొరికేవరకు బాధిస్తుంటుంది.
కష్టాలు వచ్చినప్పుడు (వైమీ) నాకే ఎందుకు అనుకోకుండా.. (ట్రైమీ) మరోసారి ప్రయత్నిద్దామనుకంటే ఓటమిని జయించినట్టే.