
Acid Attack: పెళ్లి.. స్త్రీ, పురుషుల జీవితంలో ఇదో మధురమైన ఘట్టం. హిందూ సంప్రదాయంలో దీనికి అత్యంత విలువ, గౌరవం ఉన్నాయి. జీవితంలో ఒక్కసారే చేసుకునే ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పెరుగుతున్న ఆధునికతను ప్రస్తుత తరం వివాహానికి జోడించి గ్రాండ్‌నెస్ మరింత పెంచుతున్నారు. ఇలా వివాహబంధంలో ఒక్కటవుతున్న ఓ జంటపై యాసిడ్ దాడి జరిగింది. పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతుండగా ఓ దుండగుడు యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ ఘటనలో వధూవరులతోపాటు 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బుధవారం రాత్రి జరిగింది.
కరెంటు తీసేసి..
బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీతా కశ్యప్ (19)కు వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి ముహూర్త నిర్ణయించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. వధూవరులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా వేడుకలో లైట్లు ఆరిపోయాయి. కరెంటు పోయి ఉంటుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే ఓ దుండగుడు వధూవరులపై యాసిడ్ పోశారు. దీంతో అది పక్కనే ఉన్న వారిపై కూడా పడింది. మంటలో అందరూ పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వచ్చి బాధితులను మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
గాయపడింది వీరే..
యాసిడ్ దాడి ఘటనలో వరుడు దమ్రు బాఘెల్(23), వధువు సునీతా కశ్యప్(19), సంపత్ బాఘెల్(32), ఆరేళ్ల తేమేశ్వర్ మౌర్య, తుల కశ్యప్(19), నాలుగేళ్ల జమానీ కశ్యప్, గుంజి. ఠాకూర్ (25) కరీ బాయి కశ్యప్(29), గున్మణి కశ్యప్(29), మల్తీ కశ్యప్(38), మిత్కీ కశ్యప్(38), గోయండ కశ్యప్(38) గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ నివేదా పాల్ తెలిపారు.

నిందితుడి కోసం గాలింపు..
అయితే ఈ యాసిడ్ దాడి వెనుక ఎవరున్నారు, దాడిచేసింది ఎవరు, ప్రేమ కోణం ఏదైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. మరోవైపు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు నిందితుడిని మాత్రం గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు. వధూ వరుల్లో ఎవరికైనా గతంలో ప్రేమ వ్యవహారం నెరిపారా.. బంధువుల్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారా, ఆ కారణంగా ప్రేయసి లేదా ప్రయుడు, లేదా వధూవరుల బంధువుల్లో ఎవరైనా ఈ పని చేశారా అని ఆరా తీస్తున్నారు.
త్వరలోనే దాడిచేసినవారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడిస్తున్నారు. పథకం ప్రకారమే దాడి జరిగినట్లు తెలుస్తోందని చెబుతున్నారు.