
ABN RK- CM KCR: ఇవ్వాళా తెలుగు పత్రికల బ్యానర్ వార్తలు దాదాపు ఒకటే. అన్నీ కూడా ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ను సిబిఐ విచారించిన తీరును రాసుకొచ్చాయి. ఇక ఆ నమస్తే తెలంగాణ అరవింద్ కేజ్రీవాల్ కోణంలో వార్త రాసుకొచ్చింది. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ జరగలేదంటూ తేల్చి చెప్పింది.. ఆ వార్త ఎందుకు రాసిందో, ఎందుకు రాయాల్సి వచ్చిందో అందరికీ తెలుసు కాబట్టి.. ఇక ఈనాడు నొప్పించకుండా, తాను నొవ్వకుండా రాసింది.. ఈమధ్య ఆ పత్రికలో జర్నలిస్టిక్ స్పిరిట్ పూర్తిగా లోపిస్తోంది.. ఏదో రాశామంటే రాశాం అన్నట్టుగా ఉంటున్నది ఆ పత్రిక వ్యవహారం.. ఇక వెలుగు తనకు అలవాటైన యాంగిల్ లోనే వార్త రాసింది. ఎందుకంటే తన యజమాని భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి, ఆ పార్టీ ఫోల్డ్ కు అనుగుణంగా వార్త రాసింది.. ఇక సాక్షి అయితే ఈ మద్యం కుంభకోణంలో తన యజమాని పార్టీకి చెందిన ఎంపీ ఉన్నాడు కాబట్టి.. సో సో గా రాస్కొచ్చింది. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రజ్యోతి గురించి.
ఈ మధ్య కేసీఆర్ మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు.. ఏమాత్రం అవకాశం వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. నిన్నటికి నిన్న తన కొత్త పలుకులో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తూర్పారపట్టాడు . వైజాగ్ స్టీల్ బిడ్ లో పాల్గొంటున్నట్టు కవరింగ్ ఇస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవిలో ఉక్కు పూలు పెడుతున్నాడని ఆరోపించాడు..ఆఫ్ కోర్స్ తనకు అత్యంత ఇష్టమైన చంద్రబాబు జోలికి పోతే ఆర్కే ఊరుకుంటాడా? అందుకే ఈ ఆవేశం.. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌత్ గ్రూప్ కు కర్త, కర్మ, క్రియ లాగా ఆమె వ్యవహరించిందంటూ మీడియా కోడై కూస్తోంది. ఈడీ ఇస్తున్న లీకులతో మరింత మసాలా యాడ్ చేసి రాస్తోంది.. సరే ఇదంతా ఒక ఎత్తు.

నిన్న ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ను సిబిఐ అధికారులు విచారించిన క్రమంలో ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త డిఫరెంట్ యాంగిల్ లో ఉంది. అన్ని పేపర్లకు వదిలేసి రాధాకృష్ణకు మాత్రమే సీబీఐ లీకులు ఇచ్చినట్టు వార్త ప్రజెంటేషన్ లో కనిపిస్తోంది. ” కెసిఆర్ తో లింక్ ఏంటి? రాజకీయ సంబంధాలేనా? ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయా? పంజాబ్ ఎన్నికల్లో కేసీఆర్ మీకు సహకరించారా? మద్యం కుంభకోణంలో చేతులు మారిన హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి గోవాకు ఎలా తరలించారు? అందులో మీ పాత్ర ఏంటి? పంజాబ్ ఎన్నికలకు ఆ డబ్బునే వినియోగించారా?” ఇలా రాసుకుంటూ పోయాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. నిజంగా చూసే వారికి ఇంత ఎక్స్క్లూజివ్ వార్త రాధాకృష్ణకు మాత్రమే ఎలా తెలిసింది? సీబీఐ మాత్రమే కాదు ప్రగతి భవన్ లో కెసిఆర్ కవితను ఆ మధ్య ఏం తిట్టాడో కూడా ఆర్కే కు తెలుసు. ఈ ముక్క ఆయనే కవితతో ఆ మధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ విచారణ కూడా పూస గుచ్చినట్టు చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే సిబిఐ అధికారులు విచారణలో రాధాకృష్ణ సహాయం అడిగారా? మీరు ఉంటే మాకు ధైర్యం ఉంటుందని మోకరిల్లారా? అరవింద్ ను ఎలాంటి ప్రశ్నలు అడగాలో, కుంభకోణం గుట్టుమట్లు ఎలా కనుక్కోవాలో వేడారా” చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. ఆర్కే కను సన్నల్లో సీబీఐ పని చేస్తున్నట్టు, ఆయన ఆధ్వర్యంలోనే అరవింద్ ను విచారణ చేసినట్టు వార్త రాసుకొచ్చారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు.. బై ది వే ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని మొదటి పేజీలో ప్రచురించిన రాధాకృష్ణ.. మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సిఐడి విచారణ కూడా అదే స్థాయిలో ప్రజెంట్ చేస్తే బాగుండేది కదా! అంటే ఈనాడు కిరణ్ నివాసంలో జరిగిందో రాధాకృష్ణకు తెలియదా? ఆయనకంత స్కోప్ ఇవ్వలేదా? ఒకవేళ తెలిసినా కూడా రాయలేదా? మనవాడే కాబట్టి కుల ధర్మం పాటించారా? అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.