
Nehru Zoological Park Cheetah: మొన్నటి వరకు గుండెపోటుతో మనుషులు మరణిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. యువకులు గుండెపోటుతో ఆకురాలినట్టు రాలుతున్నారు. కానీ అది జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు.తాజాగా చిరుత పులి గుండె పోటుతో మరణించడం అందరినీ షాకింగ్‌కి గురి చేసింది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో ఆదివారం చిరుతపులి మృతి చెందింది. జూలో ఉన్న 15 ఏకైక చిరుత శనివారం గుండెపోటుతో మృత్యువాతపడింది.
సౌదీ రాజు ఇచ్చిన కానుక..
నెహ్రూ జూపార్క్‌కి ఈ చిరుత 2013లో సౌదీ నుంచి వచ్చింది. 2013లో సౌదీ రాజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూపార్క్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా జూపార్క్‌కు చిరుతను బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చిరుతను బహుమతిగా అందించారు. సౌదీ వెళ్లగానే.. విమానంతో చిరుతపులిని హైదరాబాద్ జూకి పంపించారు. దీనికి అబ్దుల్లా పేరు పెట్టారు. ఇన్ని రోజులపాటు సందర్శకులను ఆకట్టుకున్న చిరుత శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. చికిత్స కోసం జూ పార్కులోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వెటర్నరీ డాక్టర్లు, అధికారులు చిరుతను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరణించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చిరుత గుండెపోటుకు గురైనట్టు జూ అధికారులు వెల్లడించారు.

చిరుత లేని జూ పార్క్..
చిరుత మరణంతో ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్కులో అసలు చిరుతలే లేకుండా పోయాయి. భారతదేశంలో దాదాపు 70 ఏళ్ల క్రితం నుంచి చిరుతలు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గతేడాది నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారతదేశంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనంలో ఉన్నాయి. నెహ్రూ జూ పార్కులోని ఒక్కగానొక్క చిరుత మరణించడంతో జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.