MCD Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 250 వార్డులకు గాను 134 వార్డులు గెల్చుకుంది. 15 సంవత్సరాల బిజెపి పాలనకు చరమగీతం పాడింది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది, ఇతరులు మూడు వార్డుల్లో గెలిచారు.. ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నప్పటికీ… 134 స్థానాలు గెలుచుకున్నా మేయర్ మాత్రం చీపురు పార్టీ నుంచే గెలుస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడి నిబంధనలు అలా ఉన్నాయి. ఆప్ మేయర్ అభ్యర్థిని నిలబెడితే బిజెపి వ్యతిరేకించవచ్చు. అలాగే తన అభ్యర్థిని నిలబెట్టవచ్చు.. మేయర్ కోసం జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ పైన గెలిచిన వార్డ్ మెంబర్ అయినా అవతల పార్టీ అభ్యర్థికి ఓటు వేయవచ్చు. పైగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఎం సి డి వార్డ్ మెంబర్లకు వర్తించదు. దీంతో ఆయా పార్టీల తరఫున గెలిచిన సభ్యులు వారి పార్టీ బలపరిచిన మేయర్ అభ్యర్థికి ఓటు వేయాలని లేదు. దీంతో మేయర్ ఎన్నికపై సందిగ్ధం ఏర్పడింది. గతంలో పంజాబ్లో చండీగఢ్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ బిజెపి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అరవింద్ కేజ్రివాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ వార్డు మెంబర్లను బిజెపి వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఇందుకోసం వారిని ప్రత్యేక విడిది కేంద్రాలకు తరలించినట్టు తెలుస్తోంది.

సమాంతరంగా ఎన్నికలు జరిగాయి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు కూడా సమాంతరంగా ఎన్నికలు జరిగాయి. పై రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది.. ఇటీవల జరిగిన ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆద్మీ పార్టీ బరిలోకి దిగింది. కేజ్రీవాల్, ఆప్ కీలక నేతలు మొత్తం ఆ రాష్ట్రాల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.. అదే సమయంలో ఎం సి డి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి.. డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరిగాయి. అయితే తమ పార్టీని చిక్కుల్లో పడేసేందుకే బిజెపి ఇటువంటి కుట్ర పన్నిందని అప్పట్లో ఆప్ నాయకులు ఆరోపించారు. అయితే ఆ ప్లాన్ ఫలించలేదు. పైగా ఆప్ కన్వీనర్ సహా పార్టీ కీలక నేతలు పెద్దగా ప్రచారం చేయకపోయినప్పటికీ మునిసిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ విజయం సాధించింది.
జాతీయ పార్టీ అవుతుందా
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇది కేజ్రివాల్ లో మరింత విశ్వాసాన్ని నింపింది. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఆప్ గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ అదే జరిగితే ఆప్ జాతీయ ప్రణాళిక కు ఈ విజయాలు దోహదపడతాయి. సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఆప్ ఆవిర్భవించింది. దశాబ్దం తిరిగేసరికి జాతీయ పార్టీ దిశగా పరుగులు పెడుతోంది.

నరేంద్ర మోడీపై గురి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా గతంలో ఎన్నడూ నేరుగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయని కేజ్రివాల్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. గుజరాత్ లో పలు ర్యాలీల్లో పాల్గొన్న ఆయన ప్రధాని, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ప్రచారం చేశారు. దీంతో భవిష్యత్తులో జాతీయస్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్ పోరు తప్పదేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇచ్చిన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఇదే ఊపులో జాతీయ పార్టీగా అవతరించాలని ఉవ్విళ్ళూ రుతోంది.