Transgender Marriage: ఇదివరకు అబ్బాయి అబ్బాయిని, అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ ఓ అబ్బాయి అమ్మాయిగా మారి అబ్బాయిని వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అర్షద్, వీణవంక మండలానికి చెందిన ట్రాన్స్ జెండర్ దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమ విషయం ఇళ్లల్లో పెద్దలు అంగీకరించకపోయినా బంధువులు నో చెప్పినా వారిద్దరు మాత్రం ఒక్కటయ్యారు. దీంతో వీరి పెళ్లి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది.

వివాహం తరువాత వీరు ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనార్థం విచ్చేశారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. వీరి పెళ్లిపై అందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన అదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట పెళ్లి కూడా ఇలాగే జరిగింది. ఈ జంటను వారి కుటుంబాలు వేరు చేశాయి. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారు మళ్లీ ఒక్కటయ్యారు. పాఠశాల నుంచి వీరిద్దరు కలిసి చదువుకుని చివరకు పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కలిసి వివాహం చేసుకుంటే వారికి ఎలాంటి చట్టం వర్తించదు. ఇక్కడ ట్రాన్స్ జెండర్ కావడంతో అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోరుకున్న వాడి కోసం మగాడే ట్రాన్స్ జెండర్ గా మారి దివ్యగా మారాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి వరకు దారి తీసింది. అందరు వీరి పెళ్లి గురించి విచిత్రంగా మాట్లాడుకుంటున్న వారు మాత్రం లెక్క చేయడం లేదు. తాము ప్రేమించుకున్నామని ధైర్యంగా చెబుతున్నారు.

ట్రాన్స్ జెండర్ గా మారిన యువకుడు తాను ప్రేమించిన వాడి కోసం అంత పని చేశాడు. పేరు మార్చుకుని అతడిని వివాహమాడాడు. జగిత్యాలలో ఉండి కొద్ది రోజులు చదువుకున్న యువకుడు తాను ప్రేమించిన వాడి కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు. ఇంట్లో, సమాజంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తమ ప్రేమ కోసమే ఇదంతా చేశారు. సర్జరీ చేసుకోకముందే అర్షద్ అతడికి ప్రపోజ్ చేశాడు. కానీ ఇద్దరం మగవారిగా ఉంటే బాగుండదని భావించి అతడు దివ్యగా మారాడు. తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లిపీటలు ఎక్కారు.