
Wife Kills Husband: ఆధునిక కాలంలో వైవాహిక బంధానికి విలువ లేకుండా పోతోంది. టెక్నాలజీ మోజులో పడి.. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వివాహేతర బంధాలు పెట్టుకుని సంసారాలు కూల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా కలకాలం కలిసి ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను ఆమె తుంగలో తొక్కింది. ప్రియుడి మోజులో పడి భర్తను మర్చిపోయింది. తాను ఏం చేస్తున్నానన్న విషయం కూడా తెలియకుండా ప్రవర్తించింది. చివరకు ప్రియుడికి తనకు మధ్య అడ్డుగా ఉన్నాడని భర్తనే అంతమొందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కూలీ పనులకు వెళ్లి తిరిగి రాలేదని..
మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ(35) కూలీ పనులకు వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య ఉప్పర వరలక్ష్మి గతేడాది జూన్ 30న మాధవరం ఠాణాలో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నారాయణ ఆచూకీ ఎంతకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులను అనుమానించడం మొదలు పెట్టారు. నారాయణ భార్య సెల్‌ఫోన్ కాల్స్ వివరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.
తాగొచ్చి అనుమానిచండంతో..
నారాయణ రోజూ మద్యం తాగి భార్యను అనుమానపడుతూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో భర్తపై విసుగు చెందిన వరలక్ష్మి మరో తోడు కోరుకుంది. ఈ క్రమంలో సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్నగోవిందుతో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అనుమానాన్ని నిజం చేసింది.
అడ్డు తొలగించుకోవాలని..
ప్రియుడు, తనకి మధ్య భర్త నారాయణ అడ్డుగా ఉండడంతోపాటు తరచూ వేధిస్తుండడంతో విసిగిపోయిన వరలక్ష్మి నారాయణ అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలిసి ఆమె ప్రణాళిక రచించింది. పథకం ప్రకారం చిన్నగోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లి మద్యం తాగించి రైలుపట్టాలపై పడుకోబెట్టాడు. రైలు పైనుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్రగాయాలై నారాయణ చనిపోయారు. చిన్నగోవిందు ఆ విషయాన్ని వరలక్ష్మికి ఫోన్‌లో చెప్పాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏడాది తర్వాత వెలుగులోకి..
పోలీసుల విచారణలో నారాయణ మృతికి భార్య వరలక్ష్మి, ఆమె ప్రియుడు చిన్నగోవిందు కారణమని గుర్తించారు. నిందులను ఏడాది తర్వాత అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తామే ఈ హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
తాగొచ్చి అనుమానిస్తున్నాడు.. కొడుతున్నాడన్న కారణంలో భర్త అనుమానం నిజం చేయడంతోపాటు చివర అడ్డు తొలగించుకున్న భార్య చివరకు కటకటాలపాలైంది.