
Turkey Earthquake: టర్కీ సిరియాల్లో భూకంపం ధాటికి విలవిలాడాయి. భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. వేలాది మంది మృత్యువాతపడ్డారు. ఎంతో మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. శిథిలాల తొలగింపులో కనిపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉంటున్నాయి. ఎటు చూసినా హాహాకారాలు. ఎక్కడ చూసినా భీతిల్లే సంఘటనలే కనిపిస్తున్నాయి. దీంతో రెండు దేశాల్లో పరిస్థితికి ప్రపంచమే ఆందోళన చెందుతోంది. భూకంప ప్రభావంతో దెబ్బతిన్న దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటికి 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం టర్కీలో 17 వేలకు పైగా, సిరియాలో 3 వేలకు పైగా మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కన్న బిడ్డకు రక్షణగా..
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో కనిపించిన ఓ దృశ్యం అందరిని కలచివేసింది. కాంక్రీటు బిల్డింగుల శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఓ భవనం శిథిలాల కింద కూర్చున్న స్థితిలో ఓ వ్యక్తి శవం కనిపించింది. కానీ మృతుని చేతుల కింద ఓ చిన్నారి కనిపించాడు. అతడు కూడా చనిపోయాడని అనుకున్నారు. అతడు చనిపోలేదు. జీవించే ఉండటంతో హుటాహుటిన వైద్య చికిత్సల కోసం పంపించారు. కళ్లు మూసుకున్న ఆ బాబు వెలుతురు రావడంతో సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు.
తన ప్రాణాలే అడ్డుగా..
ఆ తండ్రి తన కొడుకును కాపాడే క్రమంలో తన ప్రాణాలనే పణంగా పెట్టడం అందరిని ఆశ్చర్యపరచింది. చేతిలో చిన్న రాయి పట్టుకుని శబ్ధం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా లాభం లేకపోయింది. తన కొడుకు బతికే ఉండాలని తన ప్రాణాలను అడ్డుగా పెట్టాడు. అది చూసిన వారందరు అవాక్కయ్యారు. కన్న ప్రేమ ముందు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా భావించిన ఆ తండ్రి త్యాగాన్ని అందరు కీర్తించారు. ఇలాంటి ఘటనలు టర్కీ, సిరియాల్లో కనిపిస్తున్నాయి.

మరో ఘటనలో..
ఇంట్లో మంచం మీద పడుకున్న ఓ 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అది చూసిన తండ్రి ఆ అమ్మాయి చేయి పట్టుకుని మూడు రోజులుగా అక్కడే కూర్చుండిపోయాడు. చలి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా అతడు కదలకుండా అక్కడే కూర్చుని కంట తడి పెట్టుకుంటూ రోదించిన తీరు కూడా అందరిలో ఆశ్చర్యం కలిగించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత బృందాలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. క్షతగాత్రులను తరలించడంలో సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
ప్రపంచ బ్యాంకు 1.78 బిలియన్ల సాయం
టర్కీ, సిరియాలకు ప్రపంచ బ్యాంకు అండగా నిలుస్తోంది. 1.78 బిలియన్ల ఆర్థిక సాయాన్ని అందించనుంది. భూకంప ధాటికి ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా కొన్ని దేశాలు కూడా సాయం చేస్తున్నాయి. భూకంప బాధిత దేశాలను ఆదుకుంటున్నాయి. కనీవిని ఎరగని రీతిలో నష్టపోయిన టర్కీ, సిరియాలను అక్కున చేర్చుకుంటున్నాయి.