
Adipurush Special Poster: నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆదిపురుష్ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ధ్యానముద్రలో ఉన్న హనుమాన్ పోస్టర్ ఆకట్టుకుంది. హనుమంతుడు మదిలో శ్రీరాముడు ఉన్నాడని తెలిసేలా బ్యాక్ గ్రౌండ్ లో రాముడిగా ప్రభాస్ ని చూపించారు. ఆదిపురుష్ లేటెస్ట్ పోస్టర్ వైరల్ అవుతుంది. లేటెస్ట్ పోస్టర్ పై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. రాముడు, సీత, లక్ష్మణులకు నమస్కారం చేస్తున్న హనుమంతుడితో కూడిన ఆ పోస్టర్ నెగిటివిటీ ఎదుర్కొంది.
ఆదిపురుష్ కి సంబంధించిన ఓం రౌత్ ప్రతి ప్రయత్నం బెడిసి కొడుతుంది. ఆదిపురుష్ టీజర్ తో మొదలైన సెగ ఆయన్ని వెంటాడుతుంది. బహుశా ఈ రేంజ్ నెగిటివిటీ ఆయన అంచనా వేసి ఉండరు. ఇండియాలో రాముడు అతిపెద్ద సెంటిమెంట్. రాముని రూపం నుండి రామాయణంలోని ప్రతి అంశం హిందువుల మనోభావాలకు సంబంధించింది. రామాయణాన్ని ఓం రౌత్ అధ్యయనం చేశారో లేదో కానీ ఆయనేదో ప్రయోగం చేస్తున్నారని అర్థం అవుతుంది.
ఆదిపురుష్ మూవీలోని ప్రధాన పాత్రల లుక్స్ భిన్నంగా ఉన్నాయి. రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు, హనుమంతుడు అవతారాలపై వివిధ ఖాండాలలో వారు ఎలా ఉన్నారనే అవగాహన, ఆలోచన ఇండియన్స్ లో ఉంది. వారి ఊహకు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా హర్షించరు. ఆదిపురుష్ విషయంలో అదే జరుగుతుంది.

ఆదిపురుష్ టీజర్ మీద విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఓం రౌత్ ని హిందూవాదులు ఏకిపారేశారు. ఆ దెబ్బతో జనవరికి రావాల్సిన చిత్రాన్ని జూన్ 16కి వాయిదా వేశారు. కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఆరు నెలల సమయం తీసుకున్నారు. ఇక థియేటర్స్ లో ఆదిపురుష్ ఈ మేరకు మెప్పిస్తుందో చూడాలి. సీతగా కృతి సనన్ చేస్తున్నారు. మెయిన్ విలన్ రావణాసురుడు పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు. అందులోనూ ఐకానిక్ రాముడు పాత్ర కావడంతో ఇండియా వైడ్ హైప్ ఏర్పడింది.