Cat Kidnap: క్యాట్ కిడ్నాప్.. ఇదేందిరా బాబు అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. పిల్లి ఎదురొస్తేనే అపశకునం అనుకుంటాం. పిల్లిని ఎత్తుకెళ్లే పిచ్చోడు ఎవడు అనుకుంటున్నారా.. వాడు పిచ్చోడేం కాదు.. వాడు ఎత్తుకెళ్లిన పిల్లి మామూలు పిల్లి కాదు. అందుకే కిడ్నాప్ చేశాడు మరి. పోలీసులు రంగంలోకి దిగారు అంటే ఆ క్యాట్ వెరీ వెరీ స్పెషల్ మరి.

అరుదైన జాతి మరీ..
మా గల్లీకి రండి మస్తు పిల్లులు ఉన్నాయ్.. ఎత్తుకెళ్లండి అనుకుంటున్నారేమో.. ఆ పిల్లి మన గల్లీలో ఉండేలాంటిది కాదు. అరుదైన జాతికి చెందినది. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని జహంగీర్‌కాలనీలో షేక్‌అజహార్ మహమూద్ పెంచుకుంటున్న పిల్లి. అరుదైన జాతికి చెందిన ఈ పిల్లిని అతను రూ. 50 వేలకు కొన్నాడు. ఆ పిల్లికి నోమనీ అని నామకరణం చేశారు.

కళ్లు ప్రత్యేకం..
థాయిలాండ్ జాతికి చెందిన ఈ పిల్లి కళ్లు ఎంతో ప్రత్యేకం. ఒక కన్ను డైమండ్ కలర్, మరో కన్ను రెడిష్ గ్రే రంగులో ఉంటుంది. ఆదివారం రాత్రి నుంచి పిల్లి కనిపించకుండాపోయింది. రెండు రోజులు గాలించినా దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు షేక్‌అజహార్. కనిపించకుండా పోయిన పిల్లి అరుదైన హౌ మనీ జాతికి చెందినగా చెప్పాడు.. చుట్టుపక్కల వెతికిని ఫలితం లేకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఎత్తుకెళ్లినట్లు రికార్డు అయిందని పేర్కొన్నాడు. దీంతో పిల్లికోసం పోలీసులు రంగప్రవేశం చేశారు. పిల్లిని అపహరించినవాడిని పట్టుకునేపనిలో పడ్డారు.