
Ram Charan- Good Morning America Show: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిబ్రవరి 22న ప్రతిష్టాత్మక గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొననున్నారు.భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం పది గంటల ప్రాంతంలో ఇది ప్రసారం కానుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామరాజుగా అద్భుత నటన కనబరచిన నేపథ్యంలో ఆయన ఈ గౌరవానికి ఎంపికయ్యారు. అమెరికన్ షోకి ఆహ్వానించబడ్డారు. ఈ షోలో పాల్గొన్న భారతీయ నటుల్లో ఒకరిగా చరణ్ గుర్తింపు పొందారు. హాలీవుడ్ నటులు సైతం దీన్ని విశిష్ట గౌరవంగా భావిస్తారు.
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ స్థానిక ఆడియన్స్ తో మమేకం కానున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి తన అనుభవాలు నేరుగా వారితో పంచుకోనున్నారు. అమెరికన్ ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ షో కోసం అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్టాత్మక షోలో రామ్ చరణ్ వాక్చాతుర్యం చూడాలని ఆశపడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడనడానికి ఈ పరిణామం నిదర్శనం. దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం విదితమే.
రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. దీక్షకు ధరించి దుస్తుల్లోనే ఆయన ఈ షోలో దర్శనమివ్వనున్నారు. ఇదో విశేషం కానుంది. అలాగే ఆయన ఆస్కార్ వేడుకలకు హాజరు కాబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేటైన విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు కచ్చితంగా ఆస్కార్ గెలుస్తుందని భారతీయులు భావిస్తున్నారు. ఈసారి అకాడమీ అవార్డ్స్ భారతీయులకు ప్రత్యేకం కానున్నాయి.

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఎన్టీఆర్-చరణ్ హీరోలుగా నటించారు. డివివి దానయ్య నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది.
