Social Media : సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ఫేమస్ అవ్వాలని.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అవ్వాలని.. చాలామంది తల తిక్క పనులు చేస్తున్నారు. ఫేమస్ అవడం పక్కన పెడితే నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది చేసే చేష్టలైతే ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఎటువంటి అవగాహన లేకుండా వారు చేస్తున్న పనులు చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారిలో ఇతనూ ఒకడు. రష్యా కు చెందిన ఈ వ్యక్తి తన సొంత కొడుకు పై ప్రయోగాలు చేసి, చివరికి అతడి మరణానికి కారకుడయ్యాడు. ఈ సంఘటన ఏడాది క్రితం జరగగా.. నేరం రుజువు కావడంతో వెలుగులోకి వచ్చింది. అతడు చేసిన పనిని తీవ్రంగా మందలిస్తూ రష్యా కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఏం జరిగిందంటే..
రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం గురించి చెబుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని.. ఆ వివరాలు యూజర్లకు చెప్పి ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన సొంత కొడుకు పైనే ప్రయోగాలకు దిగాడు. వాస్తవానికి ఒక మనిషి ఆహారం తింటేనే బతుకుతాడు. కానీ సూర్య రష్మితోనూ బతుకుతాడని నిరూపించాలనేది మాక్సిమ్ అసలు ప్లాన్. వాస్తవానికి ఇది భ్రమ అని తెలిసినప్పటికీ తను ఒక పిచ్చిలో ఉంటూనే.. యూజర్లను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయోగం మొదలు పెట్టాడు. దానిని నిరూపించేందుకు నెలలు కూడా నిండని తన కొడుకు పై ప్రయోగాలు మొదలుపెట్టాడు.
భార్య మొత్తుకున్నప్పటికీ..
ఇది సరైన పద్ధతి కాదు.. పిల్లాడికి ఆరోగ్యం పాడవుతుందని అతని భార్య హెచ్చరించింది. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదు. పైగా బిడ్డకు పాలు ఇవ్వొద్దని ఆమెను హెచ్చరించాడు. ఆ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ.. రోగ నిరోధక శక్తి పెరిగి అతడే కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తన కొడుకు ఆకలితో ఏడుస్తుంటే చూడలేక ఆ తల్లి దొంగ చాటుగా పాలు పట్టేది. తన భర్తకు దొరికిపోతాననే భయంతో తీవ్రంగా మదనపడేది. “శిశువును ఎండలో మాత్రమే ఉంచేవాడు. అలా ఉంటేనే కోరుకుంటాడని మాతో వాదించేవాడు. అతడి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడుతున్నప్పటికీ వైద్యుల వద్దకు తీసుకెళ్లేవాడు కాదు. పైగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలుడిని చన్నీళ్లలో ముంచేవాడు. దానివల్ల అతడి శరీరం దృఢంగా తయారవుతుందని మూర్ఖంగా వాదించేవాడు. క్రమంగా ఆ బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆసుపత్రి తీసుకెళ్ళేందుకు అనుమతించాడు. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ పసి బాలుడు కన్నుమూశాడు. వైద్య పరీక్షల్లో నిమోనియా సహా పలు సమస్యల వల్ల ఆ బాలుడు చనిపోయాడని తేలిందని” మాక్సిమ్ స్నేహితులు స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
బుకాయించాడు
పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు.. చేసిన ఘోరం నుంచి తప్పించుకునేందుకు మాక్సిమ్ సరికొత్త ప్రణాళిక అమలు చేశాడు. గర్భవతిగా ఉన్నప్పుడు తన భార్య సరైన పౌష్టికాహారం తీసుకోలేదని.. అందుకే బిడ్డ అనారోగ్య సమస్యలతో మరణించాడని విచారణలో కల్లబొల్లి మాటలు మాట్లాడాడు. అయితే అతని భార్య మాత్రం అసలు విషయం చెప్పేసింది. జరిగిన నేరంలో ఆమెకు కూడా పాత్ర ఉందని భావించి కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ అనంతరం మాక్సిమ్ తన తప్పును అంగీకరించాడు.తన మూర్ఖత్వం వల్లే కుమారుడు చనిపోయాడని ఒప్పుకున్నాడు.. తాను అలా కావాలని చేయలేదని.. తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడాలనేదే తన లక్ష్యమని న్యాయస్థానం ఎదుట పేర్కొన్నాడు. అతని వాదనతో అంగీకరించని కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే సోషల్ మీడియాలో పచ్చి కూరగాయలు మాత్రమే తినాలని యూజర్లకు చెప్పిన అతడు.. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు నూడిల్స్, మాంసపు పదార్థాలు వంటివి కావాలని అడిగేవాడట.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A father who caused the death of his son in a social media frenzy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com