T20 World Cup 2024 – Team India : ఐపీఎల్ ముగిసిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్ అనంతరం t20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ కప్ నకు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన స్టేడియం నిర్మాణాలు పూర్తవుతున్నాయి.. వెస్టిండీస్ లోనూ ఐసీసీ పలు క్రికెట్ స్టేడియాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.. ఐపీఎల్ సాగుతుండగానే ఇతర జట్లు టి20 సన్నాహాకాల్లో మునిగి తేలుతున్నాయి.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక టీం ఇండియా విషయానికి వస్తే టి20 వరల్డ్ కప్ నకు మొత్తం 20 మంది సభ్యులను పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. 15 మంది స్క్వాడ్, ఐదుగురు స్టాండ్ బై ప్లేయర్లు ఇందులో ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.. రోహిత్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, సంజు సాంసన్, రవీంద్ర జడేజా, శివం దూబే, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఆవిష్ ఖాన్ వంటి వారిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరిలో చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తా చాటుతున్నారు. వారి వారి టీంలకు అనితర సాధ్యమైన విజయాలు అందిస్తున్నారు.
టీం ఎంపిక మాత్రమే కాకుండా ఓపెనర్లు గా ఎవరు వెళ్లాలనే విషయంపై కూడా బీసీసీఐ ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా రోహిత్ శర్మ ఓపెనింగ్ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. గిల్ తో అతడు ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. అయితే ఈసారి గిల్ తో కాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడిగా వెళ్లాలని బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఈ నిర్ణయం పట్ల అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.. 2011 తర్వాత ఇంతవరకు ఐసీసీ నిర్వహించిన ఏ మెగాటోర్నీ లోనూ భారత్ సత్తా చాటలేకపోయింది. గత ఏడాది చివర్లో మన దేశం వేదికగా నిర్వహించిన క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టి20 వరల్డ్ కప్ నెగ్గాలని భారత్ భావిస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకొని యువరక్తానికి చోటు కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది.