
Balakrishna fan: హీరోలను దేవుళ్ళలా అభిమానులు పూజిస్తారు. వారి కోసం ఎంతకైనా తెగిస్తారు. చెమటలు పట్టినా చొక్కా చిరిగినా పట్టించుకోకుండా క్యూలో నిలబడి మొదటి షో టికెట్ సంపాదిస్తారు. వారి అభిమానానికి హద్దులు ఉండవు. ఇక పెళ్లి పత్రికలపై ఫోటోలు ముద్రించడం కూడా మనం చూశాం. అయితే ఒక అభిమాని ఏకంగా తన పెళ్ళికి బాలయ్య రావాల్సిందే అంటున్నాడు. అతని వింత కోరిక మీడియా దృష్టికి వెళ్లడంతో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ జిల్లాకు చెందిన పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడు అనే యువకుడు చిన్నప్పటి నుండి బాలయ్యకు వీరాభిమాని. ఈ అభిమానం వారసత్వంగా అతనికి సంక్రమించింది.
పెద్దినాయుడు తండ్రి సీనియర్ ఎన్టీఆర్ భక్తుడు. ఆయన్ని ప్రత్యక్ష దైవంగా పూజిస్తాడు. వారి ఇంటినిండా ఎన్టీఆర్ ఫోటోలు, పోస్టర్స్ ఉంటాయి. తండ్రి అభిమానం చూసి కొడుకు పెద్దినాయుడు ఎన్టీఆర్ కొడుకు బాలయ్యకు డై హార్డ్ ఫ్యాన్ గా మారాడు. కాగా ఇటీవల పెద్దినాయుడికి పెళ్లి కుదిరింది. మార్చి నెలలో వివాహం. పెళ్లి పత్రికలో కూడా తన అభిమానం చాటుకున్నాడు. ఎన్టీఆర్, బాలయ్య ఫొటోలతో ఆరు పేజీల పత్రిక ముద్రించాడు. అవి బంధుమిత్రులకు పంచిపెట్టాడు.
అయితే తన పెళ్ళికి బాలయ్య రావాల్సిందే అని పట్టుబడుతున్నాడు. ఆయన వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తేనే తాళి కడతానని భీష్మించుకుని కూర్చున్నాడు. బాలయ్యకు ఈ విషయం చెప్పాలని పలువురితో ప్రాధేయపడుతున్నాడు. ఓ మీడియా సంస్థ అతన్ని సంప్రదించడం జరిగింది. తన కోరికను నేరుగా వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఈ అభిమాని కోరిక బాలయ్య నెరవేరుస్తాడా లేదా అనే సందిగ్ధత నెలకొంది. పెళ్ళికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఏం జరుగుతుందో చూడాలని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్నంత పనీ చేసి పెళ్లి రోజు తాళి కట్టనని మొండికేస్తే పరిస్థితి ఏంటని అమ్మాయి తరపువారు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు బాలయ్య పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తారకరత్న మరణం నేపథ్యంలో ఆయన మరణాంతర కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవల చిన్న కర్మ చేశారు. ఇంకా దశదిన కర్మ పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా కూడా బాలయ్య పక్కన పెట్టేశారు. కొన్ని రోజుల వరకు షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తేల్చిచెప్పేశారు. కాబట్టి ఓ అభిమాని పెళ్ళికి ఆయన హాజరు కావడం జరగనిపని.