
Pakistan Crisis: కుక్క పని కుక్క చేయాలి. నక్కపని నక్క చేయాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే బెడిసి కొడుతుంది. ఇప్పుడు ఈ నాడి ఎందుకు చెప్తున్నామయ్యా అంటే.. మనతో నిత్యం కయ్యానికి కాలుదవ్వే పాకిస్తాన్ ఇప్పుడు అలాంటి స్థితిని ఎదుర్కొంటోంది.. అధ్యక్షుడి పని అధ్యక్షుడిని చేయనీయకుండా, ప్రధానమంత్రి పనిని ప్రధానమంత్రిని చేయనీయకుండా… పాలనా వ్యవహారంలోకి ఆర్మీ ప్రవేశించడం, ఇందులోకి ఉగ్రవాద సంస్థలు చొరబడటంతో పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా మారింది.. కనీసం కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా అక్కడి ప్రజలకు కరువైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీలంక మాదిరే..
గత ఏడాది ఆర్థిక సంక్షోభం శ్రీలంక పుట్టి ముంచింది. ఇదే మాదిరి ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఆర్థిక సంక్షోభం ముదిరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దయాదాక్షిణ్యల మీద పాకిస్తాన్ నిలిచింది. ఫలితంగా ధరల సూచిక నిరంతరం పెరుగుతోంది. పాకిస్తాన్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 272 రూపాయలకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్థాన్ కు సహాయం చేసేందుకు నిరాకరిస్తున్నది. ఇంకా పన్నులు పెంచితేనే సహాయం అందజేస్తామని షరతులు విధిస్తోంది..
7 బిలియన్ డాలర్ల సాయం కోసం..
ఐఎంఎఫ్ ఇచ్చే ఏడు బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సహాయం కోసం పాకిస్తాన్ ప్రజల మీద మరిన్ని పన్నులు బాదేందుకు సిద్ధమైంది. అంతే కాదు ఐఎంఎఫ్ సూచన మేరకు ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేసేందుకు మినీ బడ్జెట్ ను సైతం పాక్ ఆమోదించాల్సి వచ్చింది.. ప్రజలను 12 రకాల రక్షిత, రక్షిత వినియోగదారులుగా విభజిస్తూ మంత్రివర్గ ఆర్థిక సమన్వయ సంఘం ఈనెల 13న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చమురు ధరలను గడచిన గురువారం పెంచింది. ఈ ఏడాది జూలై తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో 639 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అమ్మకపు పన్నును 17 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇవన్నీ అక్కడి ప్రజలను ఇబ్బంది పెడతాయని, ధరల స్థాయిని మరింత పెంచుతాయని చెప్పాల్సిన అవసరం లేదు.. చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వద్ద విదేశీ ద్రవ్య నిధులు 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వాటిని తిరిగి పెంచుకోకపోతే దిగుమతుల బిల్లును తట్టుకోవడం కష్టమవుతుంది. గత్యంతరం లేక పాక్ పాలకులు అనివార్యంగా ఐఎంఎఫ్ వద్ద చేతులు చాచారు. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు.
రెట్టింపయింది
2022 డిసెంబర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పాక్ ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే రెట్టింపై 24.5 శాతానికి చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 35 శాతం వద్ద ఉంది. పాక్ జాతీయ బ్యాంకు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను గత 24 సంవత్సరాల లో ఎన్నడూ లేనంతగా 100 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక ఇన్ని రోజులు సొంత కాళ్ళ మీద నిలబడడానికి బదులు బయటి నుంచి వచ్చే ఉదారపూరిత సాయం మీద, గ్రాంట్ల మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థ నడిపించే నేపథ్యమే పాకిస్తాన్ ను ఇంతటి దురవస్థకు చేర్చింది. సాహితికమైన పన్ను విధానాన్ని పాటించి దేశీయంగా ఆదాయాన్ని పెంచుకోవడం అనే ఆరోగ్యకరమైన విధానానికి పాక్ పాలకులు స్వస్తి పలికారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

ఎందుకు ఈ రాయితీలు
విద్యుత్ పై అత్యధిక రాయితీ ఇవ్వటం, దక్షిణాసియాలోనే ఎక్కడా లేనంత స్వల్ప ధరలకు చమురు సరఫరా చేయడం వంటి చర్యలు ప్రస్తుత గడ్డు పరిస్థితికి కారణమని తెలుస్తోంది. 2004లో కేవలం 2.25 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్రవ్య లోటు… 2019 నాటికి 25.31 బిలియన్ డాలర్ల అత్యధిక స్థాయికి చేరుకుంది. తమ స్థూల దేశీయోత్పత్తికి తగిన రీతిలో పన్నులు లేకపోవడం ప్రభుత్వ ఖజానా దెబ్బతినేందుకు కారణమని, 2022 ఆర్థిక సంవత్సరంలో జిడిపితో పోల్చుకుంటే భారత దేశంలో పన్ను రేటు 17.1 శాతం గా ఉంటే, పాకిస్తాన్లో అది 9.2 శాతమే. చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి అప్పులు చేసి పప్పుకూడు తింటూ వచ్చిన కారణంగా పాక్ ఆర్థికంగా నష్టపోయిందని విశ్లేషకులు అంటున్నారు. క్రమశిక్షణాయుతమైన ఆర్థిక విధానాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్ కు అదనపు నిధుల విడుదలలో ఐఎంఎఫ్ వల్లమాలిన జాప్యం చేస్తూ వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది సంభవించిన భారీ వరదలు కూడా పాక్ ఆర్థిక పతనానికి దోహదం చేశాయి. ఈ వరదలు అనేకమంది ప్రాణాలు బలి తీసుకున్నాయి. 40 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. 8 మిలియన్ ఎకరాల్లో పంటలను నష్టపరిచాయి. 33 మిలియన్ మంది ప్రజలు కట్టుబట్టలతో ఉన్న చోట నుంచి తరలిపోవాల్సి వచ్చింది. ఇలా ఒకటా రెండా పాక్ ఆర్థిక పతనానికి కారణాలు ఎన్నో..