
Jonathan Jacob Meijer: ఆస్ట్రేలియాలో నెల రోజుల క్రితం ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. 60 మంది చిన్నారులకు తండ్రి ఒక్కడే అని తేలింది. వీర్య కణాలు దానం చేయడం ద్వారా 60 మందికి తండ్రి అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. ఎల్జీబీటీ వర్గానికి చెందిన పేరెంట్స్ అందరూ ఓ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అక్కడకు పిల్లలతో పేరెంట్స్ వచ్చారు. అక్కడకు వచ్చిన పిల్లల్లో అందరూ దాదాపు ఒకేలా కనిపించారు. గమనించి పేరెంట్స్ షాకయ్యారు. ఏదో తేడా ఉందని గమనించి ఆ కోణంలో ఆరా తీశారు. ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. ఇదే షాకింగ్ అనుకుంటే.. తాజాగా ఓ వైద్యుడు 550 మందికి తండ్రయ్యాడు. ఈ డాక్టర్ కూడా వీర్య దానం ద్వారా పెద్ద సంఖ్యలో సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు అదే విషయంపై చిక్కుల్లో పడ్డాడు.
నెదర్లాండ్స్‌లో వీర్యదాత..
నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని ఓ మహిళ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఫిర్యాదు చేసిన మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ను నిరోధించాలని కోరుతూ డోనర్‌కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కేసు వేశారు.
13 క్లినిక్‌లకు వీర్యదానం..
ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్‌లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు.
కానీ ఆ వైద్యుడు వంద కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చాడు.
2017లోనే వెలుగులోకి..
జొనథన్ వంద మందికిపైగా చిన్నారులకు వీర్యదానం ద్వారా జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్‌వీఓజీ) అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. జొనథన్ దానం చేసిన వీర్యాన్ని వినియోగించకూడదని అన్ని వీర్య బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. అయితే, వేటు పడ్డప్పటికీ జొనథన్ వెనక్కి తగ్గలేదని డోనర్‌కైండ్ సంస్థ ఆరోపిస్తోంది. విదేశీయులకు తన వీర్యాన్ని దానం చేయడం ప్రారంభించాడని తెలిపింది.
సోషల్ మీడియాలో పరిచయంతో..
జొనథన్ వీర్యం అవసరమైన మహిళలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడని… అక్రమ మార్గాల్లో వీర్యదానం చేశాడని డోనర్‌కైండ్ సంస్థ తెలిపింది. తాను ఎంత మందికి జన్మనిచ్చాననే విషయాన్ని వీర్య బ్యాంకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడని పేర్కొంది. ‘డోనర్ అన్ని నిబంధనలను ఉల్లంఘించాడని, క్లినిక్‌లతో చేసుకున్న ఒప్పందాలను బేఖాతరు చేశాడని దీంతో ఆయన వీర్యం ద్వారా జన్మించిన చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డోనర్‌కైండ్ ఫౌండేషన్ న్యాయవాది మార్క్ డి హెక్ తెలిపాడు.
అయితే ఈ వీర్య దాన.. వీర.. శూరుడు జోనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.