Indigo Flight: రోడ్డుమీద మంచి స్పీడ్ లో వెళుతున్న కారు డోరు తెరిస్తే ఏమవుతుంది.. అందులో ప్రయాణించే వాళ్ళు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వెంటనే కిందపడతారు. తీవ్రంగా గాయపడతారు. కింద పడిన సమయంలో అట్నుంచి ఎదురుగా ఏదైనా వాహనం వస్తే ఇంకా అంతే సంగతులు. మానసిక స్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ఎవరు కూడా అలాంటి పని చేయాలి అనుకోరు. అలాంటిది ఆకాశంలో ఎగురుతున్న విమానం డోరు తెరిస్తే ఎలా ఉంటుంది? మీకేమైనా పిచ్చా? ఎగురుతున్న విమానం, అందులోనూ ఆకాశంలో ఉండగా.. డోరు ఎలా తెరుస్తారు? ఇదే కదా మీ ప్రశ్న.. కానీ అలాంటి ఘనకార్యాన్ని ప్రబుద్ధుడు చేశాడు.. చివరికి ఘన సత్కారం పొందాడు.
గాలిలో ఎగురుతున్న విమానం దూరం తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడికి దేహ శుద్ధి జరిగింది.. అతని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. ఈ ఘటన అగర్తలాలో చోటుచేసుకుంది.. హైదరాబాద్ మహానగరం నుంచి గుహవాటి మీదుగా అగర్తలా వచ్చిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన ప్రయాణికుడిని తూర్పు అగర్తలాలోని జిరానియా ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ దేవనాథ్ గా గుర్తించారు.. అగర్తలాలోని ఆ విమానం కిందికి దిగడానికి సిద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా వెళ్లి ముందు డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ హఠాత్ పరిణామంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఎయిర్ హోస్టెస్ అటూ ఇటూ చూడటం ప్రారంభించారు. చివరికి తేరుకొని అతడిని వెనక్కి లాగడం ప్రారంభించారు. అయినప్పటికీ అతడు డోర్ తెరిచేందుకే ముందుకు వెళ్లాడు.. ఎయిర్ హోస్టెస్ ను అతడు నెట్టి వేయడంతో భీతిల్లిన ప్రయాణికులు అతడికి దేహ శుద్ధి చేశారు.
విమానం కిందికి దిగగానే అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడు సరిగ్గా నడిచేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అతడి వాలకం చూస్తుంటే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసిందని పోలీసులు అంటున్నారు.. పోలీసులు అడిగినదానికి తిక్క తిక్క సమాధానం చెబుతుండడంతో వారు ఈ నిర్ణయానికి వచ్చారు. అతడి పర్సులో లభించిన ఆధారాల ప్రకారం.. బంధువులకు సమాచారం అందించారు. వారు అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చారు. వారికి పోలీసులు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.