Dog: ఉరుకులు పరుగుల జీవితం.. సంపాదనపై ఆశతో మనిషి.. మర మనిషిగా మారుతున్నాడు. బంధాలను దూరం చేసుకుంటున్నాడు. అనుబంధాలు, ఆప్యాయతలకు దూరం అవుతున్నాడు. దీంతో ఇప్పుడు చాలా వరకు చిన్న కుటుంబాలు వచ్చాయి. అయితే.. 2019లో వచ్చిన కరోనా మనిషికి అనేక పాఠాలు నేర్పింది. జీవిత సత్యాలను తెలియజేసింది. దీంతో చాలా మందికి అప్పుడు అర్థమైంది.. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో. కోవిడ్ తర్వాత నుంచి చాలా మంది కుక్క లేదా పిల్లిని పెంచుకోవడం అలవాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో సమానంగా చాలా మంది కుక్కలను పెంచుతున్నారు. వాటి బాగోగులు చూసుకుంటున్నారు. భూమిపై అత్యంత విశ్వాసమైన జంతువు కుక్కతో మనిషికి అనుబంధం ఈనాటిది కాదు. సింధూ నాగరికత నుంచి జంతువులను మనిషి మచ్చిక చేసుకున్నాడు. ఇలాంటి జంతువుల్లో మొదటిది కుక్కే. కుక్కలు కూడా కాసింత గంజి పోసినా.. పిడికెడు అన్నం పెట్టినా విశ్వాసంగా పడి ఉంటుంది. యజమానికి ఏదైనా అయితే తట్టుకోవు. తనను ఆదరించిన యజమానిపై కొండంత ప్రేమను చాటుతాయి. అవసరమైతే ప్రాణాలు ఇస్తాయి. అలాంటి సందర్భాలు ఉన్నాయి.
యజమానికి ఏమైందో అని..
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దీనిని గమనించిన ఓ కుక్క.. తన బాస్‌కు ఏదో అయిందని గుర్తించి.. అంబులెన్స్ వెంట పరుగు తీసింది. కుక్క ఆత్రం, ఆరాటం గమనించిన అంబులెన్స్ డ్రైవర్ వాహనం ఆపి కుక్కను కూడా అంబులెన్స్‌లో తీసుకెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలా మంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం.
యజమాని కోసం ప్రాణత్యాగం..
పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లల కోసం ప్రాణలను సైతం లెక్క చేయదు. ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. కుక్కను పెంచుకోవాలనే ఆలోచనలో అర్థం, పరమార్థం ఇదే. యజమాని కూడా తమ డాగీ అంటే ఇష్టపడతారు. చాలా మందికి కుక్క అరవడం కూడా నచ్చదు. కుక్క అని పిలవడానికి ఇష్టపడరు. దానికి పెట్టిన పేరుతోనే పిలుస్తారు. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు.
A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW
— TaraBull (@TaraBull808) September 12, 2024