Tirupati: మరో దాడి.. అరాచకం రాజ్యమేలుతుంటే ఏపీలో బతికేదెట్లా?

మొన్న ఆ మధ్యన కావలిలో ఓ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఓ ద్విచక్ర వాహనం ఉండడంతో హారన్ కొట్టారు.

Written By: Dharma, Updated On : November 11, 2023 3:39 pm

Tirupati

Follow us on

Tirupati: ఏపీకి ఏమైంది? కొత్తగా కొన్ని రకాల అరాచక శక్తులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది? రహదారులపైనే దాడులకు దిగుతుండడం.. హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్ను చితక బాదడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. విశాఖలో అయితే ఏకంగా ఓ ఆర్మీ సైనికుడు పైనే పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని తెలియజెప్పింది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో ఏకంగా ఓ బస్సు డ్రైవర్ను అర్ధరాత్రి కిందకు దించి దారుణంగా కొట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

మొన్న ఆ మధ్యన కావలిలో ఓ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఓ ద్విచక్ర వాహనం ఉండడంతో హారన్ కొట్టారు. దీంతో సదరు ద్విచక్ర వాహనదారుడు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ కొద్దిసేపటికే కారులో 14 మంది వెంబడించి.. బస్సు డ్రైవర్ పై అమానుషంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సుధీర్ నేరచరిత్ర తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.

అయితే ఆ ఘటన మరువక ముందే తిరుపతిలో సైతం అటువంటి దుశ్చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ బస్సు డ్రైవర్ పై దాడి జరిగింది. రోడ్డుపై ఆరుగురు యువకులు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో సదరు యువకులు ఆగ్రహానికి గురయ్యారు. మా వేడుకలకు ఇబ్బంది పెడతావా అంటూ డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బస్సు నుంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో ఆ ఆరుగురు యువకులు పారిపోయారు. ఈ ఘటనను చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. విపరీతంగా వైరల్ అయింది.

అయితే ఈ ఘటనలకు గంజాయి, మద్యం మత్తు కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా చలామణి అవుతుండడం తోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాసిరకం మద్యంతో యువకులు పక్కదారి పడుతున్నారని.. ఏం చేస్తున్నామో తెలియక విచక్షణ కోల్పోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.