Hyderabad Bike Stunt: హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతకన్నా వేగంగా యువతలో ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. కేవలం ఫేమస్ కావాలని, సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం రీల్స్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమలోని టాలెంట్‌ను బయట పెట్టేందుకు రీల్స్ చేయడం వరకు ఓకే. కానీ ప్రమాదకరం ఫీట్స్, స్టంట్స్ జనాల మధ్య, రోడ్లపై చేయడం… వాటిని సోషల్ మీడియాలో పోస్టుచేయడం ద్వారా మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. మనల్ని అడిగేదెవరూ.. ఆపేదవరూ అన్నట్లుగా కొంతమంది బైక్‌పై స్టంట్స్ వేస్తున్నారు. ఇక వెనకాల అమ్మాయి ఉంటే మరింత రెచ్చిపోతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో యువకులు చేసే బైక్ స్టంట్స్ ఆందోళనకరంగా ఉన్నాయి.
యువతితో స్టంట్స్..
ఈ మధ్య యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చెప్పి.. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన విన్యాసాలను చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు విన్యాసాల పేరుతో హల్చల్ చేస్తున్నారు. అమ్మాయిలతో కలిసి ఆందోళనకరమైన రీతిలో యువకులు బైక్ స్టంట్స్ చేస్తున్నారు. వెనుక కూర్చున్న యువతి.. కనీసం భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతూ కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో ఓ కుర్రాడు.. యువతిని బైక్ ఎక్కించుకుని చేసిన బైక్ స్టంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కూడా ఏం చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తూ.. అలాగే చూస్తుండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
గాలిస్తున్న పోలీసులు
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన తరువాత కూడా ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందరూ ప్రయాణించే రోడ్లపై ఇలాంటి సాహసాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా విన్యాసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. కోరుతున్నారు. ఇలాంటి స్టంట్స్‌తో గతంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు, నటుడు కోట శ్రీనివాస్‌రావు కొడుకు దుర్మరణం చెందిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్లు..
కొడుకులు ప్రాణాలకు తెగించి స్టంట్స్, ఫీట్స్ చేస్తున్నా తల్లిదండ్రులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. మైనర్లకే బైక్‌లు ఇవ్వడం వలన ఇలా రెచ్చిపోతున్నారని, ప్రమాదాలకు కారణమవుతున్నారని అంటున్నారు. తమ పిల్లలు బైక్‌లతో ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ప్రమాదం జరిగాక నష్టపోయామని బాధపడేకన్నా.. ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ కోసం హైదరాబాద్ రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్న యువత. pic.twitter.com/JuMoD4R4yC
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2023