
Electric Bike: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు, వస్తువులు కాలిపోతున్నాయి.. పేలిపోతున్నాయి. ముఖ్యంగా బైకుల్లో శరవేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. దేశంలో ఏదో మూలన ఈ ఎలక్ట్రికల్ బైకులు కాలిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. చార్జింగ్ చేస్తున్న వాహనం ఒక్కసారిగా పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి మొత్తం 90 ఎలక్ట్రికల్ బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ పనిచేసే సిబ్బంది, యాజమాన్య ప్రతినిధులు పరుగులుతీశారు. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు అదుపు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే బైకులతో పాటు వీడి పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. కోట్లలో నష్టం జరిగినట్టు షో రూమ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇటీవల ఎలక్ట్రానిక్ బైక్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. రహదారి సదుపాయం బాగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎలక్ట్రికల్ బైకులు ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కడికక్కడే పేలుతున్న బైకులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఎలక్ట్రికల్ బైకులంటేనే భయపడిపోతున్నారు. కొద్దిరోజుల కిందట విజయవాడలో ఓ ఈవీ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మరణించాడు. మొన్న తెలంగాణాలోని నిజామాబాద్‌లో ఈవీ బ్యాటరీ పేలి ఓ 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అంతకు ముందు తమిళనాడులో ఓ ఈవీ స్కూటర్ పేలి తండ్రి, కూతురు మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు జరగుతున్నాయి. ప్రతిరోజూ దేశంలో ఏదో మూలన ప్రమాదం జరుగుతునే ఉంది.
ఒక్క మార్చి, ఏప్రిల్ నెలలలోనే దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. అయితే కాలిపోతున్న బైక్ లలో ప్రఖ్యాత బ్రాండ్లకు చెందినవి ఉన్నాయి.మరికొన్ని లోకల్ బ్రాండ్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదాలకు గురైన దాదాపు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచేవే కావడం గమనార్హం.లీడ్-యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే, లిథియం అయాన్ బ్యాటరీలు చాలా కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, అధిక పనితీరును అందిస్తాయి. కానీ, అలాంటి బ్యాటరీలు సైతం కాలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటరు పెట్రోల్ రూ.130ల వరకూ ఉంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా పరిణమించింది. ఇటువంటి తరుణంలో ఎలక్ట్రికల్ బైకులతో భారం తప్పించుకుందామనుకుంటున్న వారికి పెరుగుతున్న ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొనుగోలు చేస్తామన్న వారు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు తెగ భయపడిపోతున్నారు. అయితే దీనిపై జాగ్రత్తలు, అప్రమత్తత చర్యలను ప్రజలకు కల్పించే బాధ్యతను ఆయా మోటారు సంస్థలే తీసుకోవాలి. లేకుంటే ఎలక్ట్రికల్ బైకుల క్రయవిక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది..