Godwit Bird Record: బార్ టెయిల్డ్ గాడ్ విట్ అనే పక్షి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇది వలస పక్షుల్లో ఒక రకానికి చెందినది. ఈ పక్షులు ఆగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఇటీవల ఈ పక్షి ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆగకుండా 11 రోజుల పాటు 8,435 మైళ్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. అమెరికాలోని అలస్కా నుంచి బయలుదేరిన ఈ పక్షి 11 రోజుల తరువాత ఆస్ట్రేలియాలోని టాస్మానియా చేరుకుంది. దీంతో దీని టాలెంట్ కు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2020లో మరో గాడ్ విట్ పక్షి పేరిట ఉన్న 217 మైళ్ల ప్రయాణ దూరం రికార్డును ఇది తిరగరాసింది. ఇది కనీసం ఆకలి కూడా తీర్చుకోకుండా అలసట లేకుండా ఏకబిగిన ప్రయాణించడం సంచలనం కలిగించింది. గాల్లోనే పదకొండున్నర రోజులు 13,560 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించి అరుదైన ఘనత సాధించింది. గతేడాది అక్టోబర్ 13న 234684 టాగ్ నెంబర్ తో ఉన్న పక్షి అమెరికాలోని అలస్కా రాష్ట్రం నుంచి బయలుదేరింది. అలస్కాలో గాల్లోకి ఎగిరన పక్షి నిర్విరామంగా ప్రయాణించడం గమనార్హం.
పక్షి వీపునకు దిగువన తోక భాగానికి కొద్దిగా పైన అమర్చిన 5జీ శాటిలైట్ ట్యాగ్ ద్వారా దాని ప్రయాణ దూరాన్ని రికార్డు చేశారు. పక్షి ప్రయాణించిన దూరం లండన్, న్యూయార్క్ నగరాల మధ్య రెండున్నర ట్రిప్పులకు సమానం కావడం విశేషం. భూగ్రహం చుట్టు కొలతలో 1/3 వంతు అని గిన్నిస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు. రేయింబవళ్లు ప్రయాణించడం ద్వారా గాడ్ విట్ బర్డ్ తన బరువులో సగానికి పైగా కోల్పోయినట్లు పక్షి సంరక్షకుడు ఎరికో వోహ్లర్ తెలిపారు.

అన్ని పక్షుల వలె ఇది నీటి మీద వాలదు. ఒకవేళ వాలితే దీని కాలి వేళ్ల మధ్య చర్మం లేకపోవడం వల్ల నీటి ఉపరితలంపై వాలితే మునిగిపోయే అవకాశం ఉండటంతో ఇది నీటిపై వాలకుండా ప్రయాణిస్తుంది. కొన్ని వలస పక్షులు నీటిపై వాలుతూ ఆహారం తిని మళ్లీ ఎగురుతాయి. కానీ ఆ పక్షి ఆగకుండా వెళ్తుంది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో నీటిపై పడిపోతే దాని ప్రాణాలే పోతాయి. ఎంత ఆకలి వేసినా, దాహం అనిపించినా ఇది భరిస్తూనే పోతుంది. అలస్కా నుంచి టాస్మానియా వరకు పూర్తిగా సముద్ర మార్గమే కావడం గమనార్హం. ఈ ప్రయాణంలో ఆ పక్షి ఎంత వేదన అనుభవించిందో ఊహించుకోవచ్చు.