Kakori Balidan Diwas 2022: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 750 డ్రోన్లు.. ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించాయి.. చూసేవాళ్ళకు ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతోందా అనిపించింది. కానీ తీరా తరచి చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది..

-ఎందుకు ఇలా చేశారంటే
1925… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులవి.. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ బ్రిటిష్ సైనికులు ఇబ్బంది పెడుతున్నారు.. జైల్లో వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. వీరిలో కొంతమంది ఆ దెబ్బలకు తాళలేక చనిపోతున్నారు. ఈ క్రమంలో పండిట్ రాంప్రసాద్, బిస్మిల్ అష్పాక్ ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తున్నారు.. తమను హింసిస్తున్న బ్రిటిష్ సైనికులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.. ఈ క్రమంలో 1925 ఆగస్టు 9న కాకోరి, లక్నో రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న రైలును హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో అడ్డగించారు.. స్వాతంత్ర ఉద్యమం చేసేందుకు ఆయుధాలు అవసరం కాబట్టి, అందుకు అవసరమయ్యే డబ్బును సంపాదించేందుకు రైలు దోపిడీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ దోపిడీకి ప్రణాళికను రాంప్రసాద్ బిస్మిల్, అష్పా కుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, సచింద్ర బక్షి, కేశబ్ చక్రవర్తి, మన్మథ నాథ్ గుప్తా, ముకుండి లాల్ గుప్తా, భన్వరీ లాల్ అమలు చేశారు. ఈ దోపిడీలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయారు.

-ఆయుధాలు కొనుగోలు చేశారు
ఈ రైలు దోపిడి ద్వారా వచ్చిన నగదుతో ఆయుధాలు కొనుగోలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులను మట్టు పెట్టారు.. ఈ క్రమంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరుగా వీరమరణం పొందారు.. నాటి కాకొరి ఘటనను ఉత్తర ప్రదేశ్ లో నేటికీ కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆ రాష్ట్రంలో జరిగే జెండా వందనం వేడుకల్లో ప్రతిసారి దీని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది.. తాజాగా నాటి ఘటనను స్మరించుకుంటూ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో ఒక పార్కులో మంగళవారం సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. 750 అధునాతన డ్రోన్లను ఆకాశంలో ఎగరేసి వినూత్న తరహాలో నివాళులర్పించారు.