
Virat Kohli: క్రికెట్ లో ఒక్కో రోజు ఒకొక్కరికి కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన రోజున ఆ బ్యాటర్ విధ్వంసం సృష్టించి హీరోగా మిగులుతాడు. అలాగే కొందరికి కొన్ని రోజులు కలిసి రావు. అప్పటికే అరవీర భయంకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. కలిసి రాని ఆరోజున మాత్రం ఆపసోపాలు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి కింగ్ కోహ్లీకి ఎదురైంది. ఏప్రిల్ 23 తో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. అయితే, కోహ్లీకి మాత్రం ఆరోజు కలిసి రానిదిగా మిగిలిపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో బెంగళూరు జట్టు మెరుగ్గానే ఆడుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్లో కీలక ప్లేయర్లు రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో బెంగళూరు జట్టు నాలుగు విజయాలు, మూడు ఓటములు నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. నాలుగేసి విజయాలతో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలోనూ, లక్నో జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ తేడా వల్ల బెంగళూరు జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అదరగొడుతున్న విరాట్ కోహ్లీ..
ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. 16వ ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో బెంగళూరు జట్టు 8 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 49 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు 81 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. లక్నో తో జరిగిన మరో మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మరో మ్యాచ్ లో కోహ్లీ 34 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై తో జరిగిన మరో మ్యాచ్ లో కోహ్లీ 4 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఎనిమిది పరుగులు తేడాతో ఈ మ్యాచ్ లో ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 47 బంతుల్లోనే 59 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. ఈ మ్యాచ్ లో ఆర్సిబి 24 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక ఆదివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఏడు పరుగులు తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించింది.

గతంలోనూ ఇలాగే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ..
ఏప్రిల్ 23వ తేదీ కోహ్లీకి కలిసి రానిదిగా చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు కోహ్లీ ఇదే తేదీన గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. ఏప్రిల్ 23వ తేదీన గోల్డెన్ డకౌట్ కావడం కోహ్లీకి ఇది మూడోసారి. గతంలో 2017లో ఏప్రిల్ 23న కోల్కతా జట్టుతో జరిగిన ఒక మ్యాచ్ లో కూడా కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అలాగే 2022లో సన్ రైజర్స్ తో జరిగిన మరో మ్యాచ్ లోను ఏప్రిల్ 23వ తేదీన కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తాజాగా రాజస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లోను కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో కోహ్లీకి ఏప్రిల్ 23వ తేదీ కలిసి రావడం లేదంటూ అభిమానులు.. పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఏప్రిల్ 23వ తేదీన ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ బెంగళూరు జట్టు ఓటమి పాలు కాగా, ఆదివారం రాజస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది.