
BRS Assets: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంది. కానీ ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్బిఐ కి ఇండెంట్లు పెడితే తప్పా చిన్నాచితకా బిల్లులు చెల్లించే దుస్థితి. ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి. పైగా ఆదాయానికి, ఖర్చుకు మధ్య లంకె కుదరక ఆ నెపాన్ని కేంద్రం మీద వేస్తారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ఆరోపిస్తారు. అదే సమయంలో బడ్జెట్లో కేంద్రం ఇచ్చే డివిడెంట్ లపై భారీగా ఆశలు పెంచుకుంటారు. ఇలాంటి క్రమంలో తెలంగాణలో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి ఇప్పుడు రెండో ధనిక పార్టీగా ఆవిర్భవించింది. ఇవేవో ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కావు. సాక్షాత్తు ఆ పార్టీ చెప్పిన ఆదాయం తాలూకూ లెక్కలే. దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి కంటే ముందే ఆవిర్భవించిన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ వీటిలో ఏవి కూడా డీఎంకే మినహా భారత రాష్ట్ర సమితికి దరిదాపుల్లో కూడా లేవు.
తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) 2021-22 ఏడాదికి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 218 కోట్లను ఆదాయంగా పొందింది. బీఆర్‌ఎస్ సహా వైఎస్ ఆర్‌సీపీ, టీడీపీ, డీఎంకే, జేడీయూ, ఆప్( ఇప్పుడు జాతీయ పార్టీ) వంటి పది ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 852 కోట్లు సంపాదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు బాండ్ల ద్వారా రూ. 1213 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేసింది. ‘‘2021-22కు గాను భారత ఎన్నికల సంఘానికి పార్టీలు తమ ఆడిట్ నివేదికలను సమర్పించాయి. ఆ నివేదికల ప్రకారం.. డీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్), వైఎస్ ఆర్‌సీపీ, టీడీపీ, జేడీయూ, ఎస్‌పీ, ఆప్, ఎస్‌ఏడీ, ఎంజీపీ పార్టీలు తమకు బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రూ. 852కోట్లుగా బహిర్గతపరిచాయి. వీటన్నింటిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు అత్యధికంగా రూ.318 కోట్లు ఆదాయంగా వచ్చాయి. తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్(218కోట్లు) ఉంది.
కేవలం ఐదు పార్టీల ఆదాయమే(రూ. 1024.44 కోట్లు) మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 84.44 శాతంగా ఉంది. వివరాలను వెల్లడించిన 35 పార్టీల్లో 20 పార్టీలు తమ ఆదాయం పెరిగిందని, 15 పార్టీలు తగ్గిందని తెలిపాయి. 2020-21లో వీటన్నింటి ఆదాయం కలిపి రూ. 565.42గా ఉండగా.. అది 2021-22కి రూ. 1212.70 కోట్లకు చేరింది. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్(బీజేడీ)కి అత్యధికంగా రూ. 233.94 కోట్ల ఆదాయం పెరిగింది. ఇక 2021-22 ఏడాదికి అన్ని పార్టీల ఖర్చు కలిపి రూ. 190 కోట్లుగా ఉంది’’ అని నివేదిక స్పష్టం చేసింది.

భారత రాష్ట్ర సమితి పేరు మార్చిన తర్వాత తమ పార్టీకి భారీగా విరాళాలు వస్తున్నాయని ఇటీవల కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. కాదు కొంతమంది మంత్రులు ఇచ్చిన విరాళాలతో ఏకంగా విమానం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ మధ్య ఒక హెలికాప్టర్ కు యాదగిరిగుట్టలో పూజలు కూడా చేశారు. అది కెసిఆర్ కు సంబంధించిన అత్యంత దగ్గర వ్యక్తి కొనుగోలు చేశారని సమాచారం. దానిని ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారం కోసం కేసీఆర్ వినియోగించుకుంటారని వినికిడి. మరోవైపు పార్టీకి సంబంధించి 1000 కోట్ల నగదు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమధ్య ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ భారత రాష్ట్ర సమితి దగ్గర అపారమైన నగదు నిల్వలు ఉన్నాయని, కెసిఆర్ చెబుతోంది కొంచెం మాత్రమేనని.. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే భారీగా నగదును సమీకరించగలిగే సత్తా కేసీఆర్ కు ఉందని ప్రకటించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత రాష్ట్ర సమితి దగ్గర ఎంత సంపద పోగు పడిందో.
2014 ఎన్నికల్లో పార్టీ నిర్వహణ కోసం అప్పులు తీసుకొచ్చిన కేసీఆర్.. దశాబ్దం తిరగకముందే భారత రాష్ట్ర సమితిని అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అప్పుడు అప్పుల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు నగదు నిలువలతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇవాళ ఆర్బిఐ కి బాండ్ల విక్రయించి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థాయికి దిగజారింది. అంటే 9 సంవత్సరాలలో ఎంత తేడా!