Dubbed Movies: టాలీవుడ్ లో ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాలు హవా చూపించాయి. అరడజనుకు పైగా చిత్రాలు హిట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చిత్రాలు భారీ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కానీ 2022లో పొరుగింటి సినిమా రుచులు తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. కెజిఎఫ్ 2, కాంతార, విక్రమ్, లవ్ టుడే, సర్దార్, చార్లీ 777, విక్రాంత్ రోణా ఆదరణ దక్కించుకున్నాయి. కన్నడ సినిమా వైభవాన్ని చూసింది. మూడు పాన్ ఇండియా హిట్స్ వారికి దక్కాయి. కెజిఎఫ్ 2, విక్రాంత్ రోణా, కాంతార, అన్ని భాషల్లో విజయం సాధించాయి.

కెజిఎఫ్ 2 అంచనాలకు మించి విజయం సాధించింది. 2018లో విడుదలైన కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 83 కోట్ల షేర్ వసూలు చేసినట్లు అంచనా. వరల్డ్ వైడ్ ఒక్క తెలుగు వెర్షన్ రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసిందంటే ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ/తెలంగాణాలలో గతంలో డబ్బింగ్ చిత్రాలు నెలకొల్పిన రికార్డ్స్ మొత్తం కెజిఎఫ్ 2 బ్రేక్ చేసింది.
కమల్ హాసన్ విక్రమ్ మూవీతో జూలు విదిలించారు. దశాబ్దాలుగా నిద్రపోతున్న తన మార్కెట్ ని నిద్రలేపాడు. తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్ భారీ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ విక్రమ్ రూ. 450 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగులో రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది. విక్రమ్ తెలుగు హక్కులు హీరో నితిన్ రూ. 7 కోట్లకు కొన్నారు. కన్నడ పరిశ్రమ తెరకెక్కించిన మరొక అద్భుతం కాంతార. వసూళ్లపరంగా ఈ దశాబ్దపు అద్భుతంగా కాంతారను సినిమా వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార రూ. 420 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు అందుకుంది. ఇక తెలుగులో రూ. 2 కోట్లకు కొంటే రూ. 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణా సైతం తెలుగులో హిట్ స్టేటస్ అందుకుంది. బ్రేక్ ఈవెన్ దాటి స్వల్ప లాభాలు పంచింది. లవ్ టుడే కూడా ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచింది. చార్లీ 777, సర్దార్, పొన్నియిన్ సెల్వన్ పర్వాలేదు అనిపించాయి. మంచి సినిమాను భాషాబేధం లేకుండా అభిమానించే తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ చిత్రాలకు పట్టం కట్టారు.