Pooja Hegde: పూజా హెగ్డే కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులమయమే. అయితే త్రివిక్రమ్ చేతిలో పడ్డాక ఆమె ఫేట్ మారిపోయింది. డిజాస్టర్స్ లో ఉన్న హీరోయిన్స్ ని ఎవరూ పట్టించుకోరు. త్రివిక్రమ్ మాత్రం పిలిచి పూజాకు అవకాశం ఇచ్చాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్ర హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఆ చిత్రానికి ముందు పూజా నటించిన సాక్ష్యం అతిపెద్ద పరాజయం చవి చూసింది. పూజా గ్లామర్ పై నమ్మకం ఉంచి త్రివిక్రమ్ రిస్క్ చేశాడు. నిజానికి అరవింద సమేత వీర రాఘవ విజయం త్రివిక్రమ్ కి కూడా చాలా అవసరం. ఆయన అజ్ఞాతవాసి మూవీతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు.

ప్లాప్ టాక్ ఒకప్రక్క కాపీ ఆరోపణలు మరో ప్రక్క ఉక్కిరి బిక్కిరి చేశాయి. కచ్చితంగా హిట్ కొట్టి తానేమిటో నిరూపించుకోవాల్సిన టైం లో ప్లాప్ హీరోయిన్ ని తీసుకోవడం నిజంగా సాహసమే. త్రివిక్రమ్ నమ్మకం వమ్ము కాలేదు. అరవింద సమేత వీర రాఘవ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా విజయానికి పూజా గ్లామర్ కూడా ఉపయోగపడింది. ఇక అల వైకుంఠపురంలో మూవీతో పూజా ఏకంగా ఇండస్ట్రీ కొట్టింది. త్రివిక్రమ్ తన ఫేవరెట్ హీరోయిన్ ని కొనసాగించాడు. ముచ్చటగా మూడోసారి మహేష్ మూవీ కోసం తీసుకున్నారు.
ఓ మూడేళ్ళ పాటు పూజా కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్… ఇలా వరుస విజయాలు అందుకుంది. అయితే 2022 ఆమెకు అసలు కలిసిరాలేదు. కుడి ఎడమైంది. లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ఇచ్చిన పూజా హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చారు . ఈ ఏడాది ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్, బెస్ట్ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఎఫ్ 3 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయగా.. ఆ మూవీ సైతం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

దానికి తోడు కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. పెద్ద మొత్తంలో సిబ్బందిని మైంటైన్ చేస్తూ నిర్మాతలపై ఆర్థిక భారం పెంచుతుంది అంటూ… కోలీవుడ్ దర్శక నిర్మాత సెల్వమణి ఆరోపణలు చేశారు. అలాగే ఆమె హీరోయిన్ గా ఉన్న బిగ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలో ఆగిపోయింది. విజయ్ దేవరకొండ-పూరి కాంబోలో మొదలైన జనగణమన నుండి నిర్మాతలు తప్పుకున్నారు. జనగణమన ఆగిపోవడంతో పూజా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కోల్పోయింది. అలాగే హరీష్-పవన్ భవదీయుడు భగత్ సింగ్ ఆలస్యం కావడం ఆమె మంచి ఆఫర్ కోల్పోయారు. మొత్తంగా 2022 పూజా హెగ్డేకు ఏమాత్రం కలిసి రాలేదు.