Chandrababu: చాన్నాళ్లకు చంద్రబాబు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. తెలంగాణ పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి పట్టుండడంతో పాటు ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు ప్రజలు తనను అరుదైన గుర్తింపునిచ్చారని చెప్పారు. ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ల పాటు సీఎంగా, పదేళ్ల పాటు విపక్ష నేతగా చాన్సిచ్చారని గుర్తుచేశారు. ఆ రికార్డులు అలానే ఉంటాయని.. వాటిని ఎవరూ చెరపలేరన్నారు. ఇక నుంచి తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఆ బాధ్యతలు కాసానికి అప్పగించానని.. పార్టీ నుంచి వెళ్లిన వారంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించానని గుర్తుచేశారు. తాను ఫౌండేషన్ వేయకుంటే హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. తనను 40 సంవత్సరాలు ఆశీర్వదించిన తెలుగు ప్రజల కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తానన్నారు. ఏపీలో కంటే తెలంగాణలో తనపై అభిమానం కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకూ ర్యాలీగా వస్తున్నప్పుడు ప్రజలు సాదరంగా ఆహ్వానించడం జీవితంలో మరిచిపోలేనన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి తెలంగాణలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన విషయం తెలుసుకోవాలన్నారు. నేషనల్ పొలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. జాతీయ పార్టీకు దీటుగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు.
ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఏపీ పరిస్థితి తలచుకుంటే బాధేస్తోందన్నారు. ప్రసంగంలో చంద్రబాబు చాలాసేపు ఏపీ గురించే మాట్లాడారు. తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తనను అనుసరిస్తే.. జగన్ మాత్రం నిండా ద్వేషం పెంచుకొని విధ్వంసాలకు దిగారని విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా.. ఏరంగం చూసినా విధ్వంసమే కొనసాగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడడమే తన అభిమతమన్నారు. విడిపోయినా తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిపేస్తారన్న కామెంట్స్ పై చంద్రబాబు స్పందించారు. రెండు రాష్ట్రాలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు కలిపేస్తారుట. కొందరు చేతకాని వ్యక్తులు, పాలన చేయలేని దద్దమ్మలు మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయాలని చూస్తున్నారని.. దీనికి ప్రజలు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పాలన చేస్తున్నందున అటువంటి దుష్ట ఆలోచనలు మానుకోవాలన్నారు. ఇలాంటిఅనుచిత, అవకాశావాద వ్యాఖ్యలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు రెండు రాష్ట్రాలు కలవవని క్లీయర్ కట్ గా చెప్పేశారన్న మాట.