
CSK Vs KKR: చెన్నై జట్టు ఈ సీజన్ లో అదరగొడుతోంది. గత వైఫల్యాలను అధిగమించి.. తనలోని సారధ్య మెలకువలకు సాన బెట్టి.. చెన్నై జట్టుకు అద్భుత విజయాలను అందించి పెడుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తోంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డును చెన్నై జట్టు తన ఖాతాలో వేసుకుంది.
గత రెండు.. మూడు సీజన్ల నుంచి విఫలమవుతున్న చెన్నై జట్టు.. ఈ ఏడాది మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మ్యాచ్.. మ్యాచ్ కి ఈ జట్టు మరింత రాటుదేలుతోంది. జట్టులోని ఆటగాళ్లు సమష్టి ప్రదర్శన, ధోని అద్భుత సారధ్య బాధ్యతలు వెరసి చెన్నై జట్టుకు విజయాలు దక్కుతున్నాయి. ఈ జట్టుకు ఓపెనర్లు బలంగా మారారు. ప్రతి మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టుకు భారీ స్కోర్ ను అందించి పెడుతున్నారు. ఈ జట్టు విజయాల్లో ఓపెనర్లది కీలకపాత్ర అని చెప్పడంలో సందేహం లేదు. ఈ జట్టు ఓపెనర్ డేవాన్ కాన్వే ఈ సీజన్ లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు అర్థ సెంచరీలను నమోదు చేసుకున్నాడు.
రికార్డు బద్దలు కొట్టిన చెన్నై.. ఏకంగా 18 సిక్సులు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 16వ ఎడిషన్ లో భాగంగా ఆదివారం కోల్కతా జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పింది చెన్నై జట్టు. ఈ మ్యాచ్ లో ఏకంగా చెన్నై బ్యాటర్లు 18 సిక్సులు కొట్టి రికార్డు నెలకొల్పారు. గతంలో చెన్నై జట్టు నాలుగుసార్లు 17 సిక్సులు చొప్పున కొట్టింది. ఆ రికార్డును ఆదివారం నాటి మ్యాచ్ తో బద్దలు కొట్టింది చెన్నై జట్టు. ఈ మ్యాచ్ లో రహానే, శివం దూబే ఐదేసి సిక్సులు కొట్టగా, గైక్వాడ్, కాన్వే మూడేసి చొప్పున సిక్సులు కొట్టారు. చివరిలో వచ్చిన జడేజా రెండు సిక్సులు బాదడంతో.. ఈ మ్యాచ్లో మొత్తం గా చెన్నై జట్టు 18 సిక్సలు కొట్టినట్లు అయింది. దీంతో గతంలో తానే నెలకొల్పిన రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్లు అయింది.

కప్ లక్ష్యంగా కదులుతున్న చెన్నై జట్టు..
ఐపీఎల్ లో ఈ ఏడాది చెన్నై జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నైకు సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీకి కప్ గెలిచి గొప్ప వీడ్కోలు అందించాలన్న లక్ష్యంతో జట్టు ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం జర్నీ సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది చెన్నై జట్టు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో గొప్పగా రాణిస్తున్నారు కీలక ప్లేయర్లు. దీంతో ప్రతి మ్యాచ్ లోను భారీ స్కోర్ చేస్తోంది చెన్నై జట్టు. అభిమానులు కూడా ఈసారి చెన్నై జట్టు కప్ గెలుస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.