
Nagababu- ABN Radhakrishna: ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాది ఎప్పటికీ ఒకటే ఆరాటం. తెలుగుదేశం పార్టీ బాగుండాలి. తాము నాలుగు పైసలు వేనుకేసుకోవాలి. నిత్యం టీడీపీ గురించే పరితపిస్తుంటారు. తెలుగునాట మిగతా మీడియాల అభిరుచులు, ప్రాధాన్యతలు ఎప్పడికప్పుడు మారిపోతుంటాయి. తప్ప.. ఎల్లో మీడియాగా అభివర్ణించే సంస్థల అధినేతల తీరు మాత్రం మారదు. ఇప్పుడు చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నదే వారి ప్రయత్నం. అందుకు ఎంతదాకైనా తెగించే వరకూ వెనుకాడరు. టీడీపీ, చంద్రబాబు కోసం అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు. లేకపోతే అదే కాళ్లను లాగేసి నిలువునా బోర్లా కొట్టించగలరు. దశాబ్దాలుగా దీనిని వంటపట్టించుకున్న ఎల్లో మీడియా ఇప్పుడు పవన్ ను పలుచన చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత ముమ్మరం చేసింది.
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. పొరపాటున ఓటమి ఎదురైతే మాత్రం ఆ పార్టీ కోలుకునేందుకు సైతం చాన్స్ ఉండదు. అదే జరిగితే తన కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలన్న చంద్రబాబు అభిమతం నెరవేరదు. అందుకే ఆయన గట్టిగానే పోరాటంచేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఆయనకు ఒక ఆశాదీపంలా కనిపించారు. అందుకే పవన్ ప్రాపకం కోసం చేయని ప్రయత్నం లేదు. అటు వైసీపీని గద్దె దించుతానని పవన్ సవాల్ చేశారు. అందుకు అవసరమైతేఅన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొస్తానని… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పుకొచ్చారు.. ఈ మాటతో చంద్రబాబు శరవేగంగా పావులు కదిపారు. పవన్ ను ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ, జనసేనల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది.

ఈ తరుణంలో ఎల్లో మీడియాకు పనిపడింది. ఒక వేళ పొత్తులు కుదిరితే పవన్ వల్ల టీడీపీకి లబ్ధి చేకూరాలి కానీ.. పవన్ నాయకుడిగా ఎదగకూడదన్నది ఆ మీడియా భావన. అందుకే పవన్ పై రకరకాల ప్రచారానికి దిగుతోంది. ఆ మధ్యన ఏబీఎన్ రాధాక్రిష్ణ తన వారంతపు కొత్త పలుకులో పవన్ కు బీఆర్ఎస్ అధినేత నుంచి రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చిందని.. ఏపీలో ఒంటరి పోరు.. లేకుంటే బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలన్నదే ఆ డీల్ సారాంశంగా చెప్పుకొచ్చారు. దీనిపై జన సైనికులు రెస్పాండయ్యారు. రాధాక్రిష్ణ పై విమర్శల జడివాన ప్రారంభించారు. పొలిటికల్ బ్రోకర్ గా అభివర్ణించారు.
తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే.. పవన్ కళ్యాణ్‌కు వచ్చే నష్టమేం లేదన్నారు. కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త అని హెచ్చరించారు. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలని ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే.. అవినీతి రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిర అవుతారేమో గానీ.. నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలని సూచించారు.పవన్ కళ్యాణ్ మరో పాతికేళ్లపాటు ప్రజల కోసం యుద్ధం చేయగలడన్న నాగబాబు.. మీకు అంత ఓపిక లేదంటూ.. పరోక్షంగా చంద్రబాబు వయసును ప్రస్తావించారు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తమకు లేదన్నారు. ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ ఇంకెన్నాళ్లు వాగి చస్తారని నిలదీశారు. మిగతా రెండు పార్టీల నాయకులను అదే మాట అనే దమ్ము మీకు లేదంటూ చురకలు అంటించారు.
