
Kanna Lakshminarayana: 1995 ఎపిసోడ్ గుర్తుంది కదూ…ఎన్టీఆర్ ని పదవీవిచ్యుతుడు చేసే సమయంలో దాదాపు టీడీపీ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు పంచన చేరిపోయారు. ఆ ముగ్గురు తప్ప. ఎన్నివిధాలుగా ప్రలోభపెట్టినా వారు వినలేదు. ఎన్టీఆర్ ను విడిచిరాలేదు. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో సైతం వారు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఊరూ వాడా ప్రచారం చేశారు. అయితే అలా చేసినందుకు రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక.. వారు కూడా కొన్నేళ్లకు చంద్రబాబు గూటికి చేరినా.. రైలు జీవిత కాలం లేటు అన్నట్టు.. రాజకీయ అవకాశాలు మాత్రం వారి దరి చేరలేదు. చంద్రబాబు దక్కనీయ్యలేదు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో దిగ్గజాలను ఎదుర్కొన్నారు. వారితో గట్టిగానే ఫైట్ చేశారు. ఈ క్రమంలో తన వెంట వచ్చి.. తనను మెచ్చిన వారిని మాత్రమే రాజకీయంగా ఎదగనిచ్చారు. మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాధితుడే. నాడు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందునే బయటకు వచ్చి టీఆర్ఎస్ స్థాపించారు. రాజకీయ ఉన్నతి సాధించారు.అయితే చంద్రబాబుకు గత నేపథ్యం చూసే అలవాటుంది. గతంలో తనను ఎవరైనా తిట్టినా.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినా అటువంటి నాయకులకు ఎంకరేజ్ ఉండదు. రాజకీయ సమీకరణల్లో భాగంగా పార్టీలో చేర్చుకున్నా ప్రాధాన్యత మాత్రం ఇవ్వరు.
ఎన్టీఆర్ వెంట ఉండిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు క్రిష్ణంనాయుడు, అప్పయ్యదొర తరువాత తమ రాజకీయ భవిష్యత్ చూసుకున్నారు. బుచ్చయ్యచౌదరి, గాలి ముద్దు క్రిష్ణంనాయుడులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ వారికి ఎమ్మెల్యేల వరకే చంద్రబాబు ప్రోత్సహించారు. మంత్రి పదవుల విషయంలో మొండిచేయి చూపారు. ఇందుకు గతంలో చంద్రబాబు విషయంలో వ్యవహరించిన వైఖరే కారణమన్న టాక్ పార్టీలో తరచూ వినిపిస్తుంటుంది. 2014 ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి గెలిచారు. కానీ మంత్రివర్గ ఎంపికలోకనీస ప్రాధాన్యత దక్కలేదు. అటు 2014లో పోటీచేసి రోజా చేతిలో ఓడిపోయిన గాలి ముద్దు క్రిష్ణంనాయుడులకు సైతం ఏ పదవీ ఇవ్వలేదు. టీడీపీలో సంక్షోభ సమయంలో చంద్రబాబుపై వారు చేసిన ప్రకటనలే అందుకు కారణమని ఇప్పటికీ ఒక ప్రచారం ఉంది.

అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన కన్నా.. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లబోతున్న కన్నాను పిలిచి బీజేపీ రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. అయితే అంతే వేగంగా ఆయన చేతి నుంచి పగ్గాలు తీసుకొని సోము వీర్రాజు చేతిలో పెట్టారు. దీంతో అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న కన్నా టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపారు. అటు అవసరాల దృష్ట్యా చంద్రబాబు కూడా ఒకే చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ బుచ్చయ్య చౌదరి, గాలిముద్దు క్రిష్ణంనాయుడు బాటలో కన్నా చేరుతారన్న టాక్ టీడీపీలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలో ఉన్నప్పుడు చంద్రబాబును కన్నా అనరాని మాటలు అన్నారు. చాలారకాలుగా ఆరోపణలు చేశారు. తప్పకుండా వాటిని చంద్రబాబు మనసులో ఉంచుకొని ఉంటారని.. సరైనా సమయంలో దెబ్బకొడతారన్న టాక్ అయితే నడుస్తోంది.
