YCP High Court Case: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ పోరాటంపై న్యాయస్థానం నీళ్లు చల్లింది. ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరించడమేనని ఆరోపిస్తోంది. ఈరోజు ఏకంగా దీనిపై పోరాడేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేరుగా మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ హైకోర్టు ఈ అంశంపై స్పందించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఊరట నిచ్చే అంశం. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం టెండర్లకు సిద్ధం అవుతోంది. అయితే ఈ టెండర్ల ప్రక్రియ జరగకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈరోజు దానిపై విచారణ జరగగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
* జోక్యం చేసుకోలేం..
వైసిపి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఓ ఐదింటిని మాత్రమే నిర్మించగలిగింది. అవి కూడా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పట్లో పనులు జరిగే పరిస్థితి లేదని.. అదే ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తే త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావించింది. కానీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. మరోవైపు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు అయింది. ఈరోజు విచారణకు రాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉందని… కాబట్టి టెండర్ల ఖరారు పై స్థాయి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎం డి, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ యండి లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
* నర్సీపట్నం వెళుతుండగా తీర్పు..
వైసీపీ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ కనీస స్థాయిలో కూడా పనులు పూర్తి చేయలేకపోయారు. ప్రభుత్వమే నేరుగా కట్టాలనుకుంటే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు కు చాలా సమయం పట్టి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, ఆదోని, పెనుకొండ, మదనపల్లె, పులివెందులలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కానీ దీనిని తప్పుపడుతూ ఆందోళన బాట పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత కొద్దిరోజులుగా పార్టీ శ్రేణులు ఆందోళనలు చేయగా.. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కానీ ఆయన నర్సీపట్నం చేరక మునుపే.. కోర్టు తీర్పు రావడం విశేషం. ఇది కూటమి ప్రభుత్వానికి కొండంత అండ.