Kavitha Suspension: కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పరిణామాలు రాజకీయంగా ఏ పరిస్తితులకు దారితీస్తాయి అనే విషయంలో భిన్నమైన చర్చ ఊపందుకుంది. ప్రభుత్వాన్ని కోల్పోయి, వరుస ఓటములతో కుదేలైన పార్టీని తిరిగి నిలబెట్టేందుకు పెద్దాయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీనీ ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటు ముఖ్యమంత్రి సీటు కోసం కీచులాటలో బలహీనపడుతుందనుకున్న కాంగ్రెస్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతుండటం పెద్దాయనను మరింత ఇబ్బందుల్లో నెట్టింది. దానికి తోడు పార్టీ ప్రధాన నాయకులపై అవినీతి మరకలు వాటిపై కమీషన్లు, ఏకంగా సీబీఐ దర్యాప్తులతో పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కకావికలం కాకుండా పెద్దాయన సరికొత్త వ్యూహాలతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే కవిత ఎపిసోడ్ అని తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్..వీడియో వైరల్!
కవిత సస్పెన్షన్ వెనుక కథ..
గతంలో పార్టీని విభేదించి బయటికి వచ్చిన వారు, పార్టీ లైన్ దాటి వేటుకు గురైన వారికి కేసీఆర్ కూతురిగా కవితకు చాలా వ్యత్యాసం ఉంది. కవిత సస్పెన్షన్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా, వీటి వెనుక ఆమె కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ప్రోద్బలం ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇన్ని రోజులు కవిత ఏం మాట్లాడినా మౌనం వహించిన పార్టీ ప్రెస్ మీట్లో హరీష్ రావు, సంతోష్ రావు పై ఆరోపణలు చేయడంతోనే వారు పట్టుబట్టి ఆమెను సస్పెండ్ చేయించి ఉంటారని కవిత మద్దతుదారులు అంటున్నారు. కవిత తన తండ్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎపుడూ మాట్లాడలేదనేది నిర్వివాదాంశం. ఆయనకు అవినీతి మరక అంటించినట్లు భావిస్తున్న వారిపై విరుచుకపడ్డారు. అయితే ఈ విధంగా వారిపై దుమ్మెత్తిపోసిన కవిత కావాలని ఆరోపణలు చేసిందా లేక ఇంకో కొత్త నాటకానికి తెరలేపారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. చిన్నమ్మ కొడుకు అయిన సంతోష్ రావు, మేనత్త కొడుకైన హరీష్ రావుపై విరుచుకపడ్డడం వెనుక కేసీఆర్ వ్యూహంలో భాగమే అనే వాదన కూడా వినిపిస్తోంది.
పార్టీలో తన నాయకత్వం నిలుపుకునేందుకు, ప్రజల్లో కేసీఆర్ గురించి గుణాత్మకమైన చర్చ నిరంతరం జరుగుతుండాల్లని, బీఆర్ఎస్ కు కేసీఆర్ తప్ప దిక్కులేదనే టాక్ విస్తృతంగా ప్రచారం అయితే తప్ప తన పెద్దరికానికి భంగం వాటిల్లకుండా ఉంటుందనే ఆలోచనతోనే ఈ డ్రామా తానే నడిపిస్తున్నట్లు కొంతమంది వాదిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని తీసుకున్న నిర్ణయం వల్ల కేసీఆర్ ను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసింది. సీబీఐ విచారణ ఎవరెన్ని చెప్పినా ఆగదు. కానీ ఈ విషయంలో కేసిఆర్ తప్పేమీ లేదని, ఆయన అవినీతిపరుడు కాదని, అనవసరంగా ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయని, కేసీఆర్ దేవుడు అనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఈ ఎపిసోడ్ తోడ్పడుతుందని భావిస్తున్నారు. పదవి కోల్పోయిన తరువాత వరుస పరాజయాలు ఎదుర్కొని దిక్కుతోచని పరిస్తితి నుంచి పార్టీ నీ తిరిగి గాడిలో పెట్టే చర్యలో భాగంగా వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు. లిక్కర్ కేసులో జైలు పాలై బెయిల్ పై విడుదల అయిన తరువాత కవితకు తండ్రి తప్ప మిగతా ఎవరి వద్ద గౌరవం లభించలేదు. కేసీఆర్ తప్ప కవిత ను దూరం పెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో మిగతా పెద్దల మధ్య జరిగింది. కవిత పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమని భావించిన వారు ఎప్పటి నుంచో కవితపై కారాలు మిరియాలు నూరుతున్న విషయం బహిరంగ సత్యం. ఎలాగోలా కవితను దూరం పెట్టేందుకు సమయం కోసం ఎదురుచూసిన్నట్లు కనిపిస్తోంది. అయితే కాళ్ల బేరానికి రావడం, లేకుంటే తన దారి తాను చూసుకున్నా పార్టీలో తనకు ఎదురు ఉండదని భావించినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కు కొడుకు కేటీఆర్ కన్నా కూతురు కవితపైనే ఎక్కువ మమకారం ఉందని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. కవిత ఏం చెప్పినా కేసీఆర్ ఎదురుచెప్పరనీ, ఆమె మాట కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. పార్టీ ప్రధాన నిర్ణయాలు తీసుకునే కేసీఆర్, కవిత సూచనల మేరకే నడిచేవారని ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో అడుగు జాగ్రత్త గా వేయకుంటే పార్టీ పూర్తిగా జేజారిపోయే అవకాశముంది.