SIT notices to KCR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మొన్న హరీశ్‌రావు, తర్వాత కేటీఆర్, నిన్న సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్.. తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. విచారణకు పిలిచి విచారణ చేసే ఛాన్స్ ఉంది. ఈమేరకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. గురువారం(జనవరి 29న) సాయంత్రం కేసీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్..
ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్.. వారం క్రితం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి ఏడు గంటలు విచారణ చేసింది. కీలక వివరాలు నమోదు చేసింది. విచారణలో ఏం చెప్పారో హరీశ్‌రావు, సిట్ ఇన్చార్జి సజ్జనార్ కూడా బయటకు చెప్పలేదు. ఇక తర్వాత కేటీఆర్‌ను సిట్ విచారణకు పిలిచింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడున్నర గంటలపాటు విచారణ చేసింది. విచారణ తర్వాత తనను ఏయే ప్రశ్నలు అడిగారో కేటీఆర్ మీడియాకు వెళ్లడించారు. తర్వాత మాజీ ఎంపీ, కేసీఆర్ బంధువు సంతోష్‌రావును కూడా సిట్ విచారణ చేసింది.
ఇప్పుడు కేసీఆర్ వంతు..
తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం సిట్నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌ను విచారణకు పిలిచి ఏయే ప్రశ్నలు అడగాలో కూడా క్వశ్చనీర్ కూడా తయార చేసుకుంది. అయితే కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులకు అక్కడ కేసీఆర్ లేరని తెలిసింది. దీంతో ఆయన ఎర్రవల్లిలో ఉండడంతో అక్కడికి వెళ్లారా అన్నది కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు కేసీఆర్‌ను ఎక్కడ విచారణ చేస్తారు అన్నది కూడా ఆసక్తి నెలకొంది. ఫామ్‌హౌస్‌లోనే విచారణ చేస్తారా లేక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
వారు చెప్పిన వివరాల ఆధారంగానే..
కేసీఆర్‌ను అడిగే ప్రశ్నల్లో చాలా వరకు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావు ఇచ్చిన సమాధానాలు, సమాచారం నుంచే ప్రశ్నలు అడగబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హరీశ్‌రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారని ప్రచారం జరుగుతోంది. సంతోష్‌రావు కూడా కొంత సమాచారం ఇచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రశ్నించి సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభాకర్‌రావు రిటైర్ అయిన తర్వాత కూడా పొడిగించడం వెనుక అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనిపైనా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.
కేసీఆర్ విచారణకు హాజరు కావడం పార్టీలో భయాలను పెంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాజకీయ రంగంలో టెన్షన్ పెరుగుతోంది. ఇది రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చు. అయితే, కేసీఆర్ స్పందన ఏమిటో రేపు స్పష్టమవుతుంది.