Homeటాప్ స్టోరీస్Revanth Reddy political strategy: సెట్ రైట్ చేస్తున్న రేవంత్

Revanth Reddy political strategy: సెట్ రైట్ చేస్తున్న రేవంత్

Revanth Reddy political strategy: కాంగ్రెస్ పార్టీ లో ఒక సంప్రదాయం ఉంటుంది. అధికారం లేనంతవరకు అధికారం కోసం కొట్లాడుతూ ఉంటుంది. అధికారం దక్కిన తర్వాత పదవుల కోసం ఆ పార్టీలో కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అందువల్లే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అంటారు. కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు.. కేంద్రంలో కూడా అదేవిధంగా ఉంటుంది. అందువల్లే కాంగ్రెస్ పార్టీని సామాన్య ఓటరు అంతగా నమ్మనిది. కొంతమంది చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీకి పెట్టని బలం మాదిరిగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ బలం రేవంత్ రెడ్డి రూపంలో కనిపిస్తోంది.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలమైన గొంతు గా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు కనిపించారు. అందువల్లే ఆయనను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా చూశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలమని కోరారు. తెలంగాణ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం భారత రాష్ట్ర సమితి సుప్రీం కెసిఆర్ కు మింగుడు పడలేదు. అయినప్పటికీ ప్రజా తీర్పును శిరసా వహించాల్సి ఉంటుంది కాబట్టి తప్పలేదు.

తెలంగాణ రాష్ట్ర పగ్గాలు దక్కిన తర్వాత రేవంత్ రెడ్డికి అంత ఈజీగా ఏదీ లేదు. స్వపక్షంలోనే విపక్షం లాగా పరిస్థితి ఎదురయింది. సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు. ప్రత్యర్థి పార్టీలకు లీకులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలను వివాదాస్పదం చేశారు. దీంతో అనేక రకాల వివాదాలు రేవంత్ రెడ్డిని చుట్టుముట్టాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మొదలుపెట్టారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయింది.. దీంతో రేవంత్ రెడ్డి పార్టీ మీద పట్టు సాధించారు. తోక జాడిస్తున్న కొంతమంది పార్టీ పెద్దలకు చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. దీంతో పార్టీలో రేవంత్ పెత్తనం పెరిగిపోయింది.

ఇప్పుడు ప్రభుత్వంలో కూడా రేవంత్ తన దూకుడు తనం చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఇందిరమ్మ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గృహాలను నిర్మించారు. ఇంకా రెండవ దశ, మూడోదశలో కూడా గృహాలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దివ్యాంగులకు.. త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. సన్న ధాన్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నారు. ఇవే కాకుండా త్వరలో చౌక దుకాణంలో ప్రజలకు జొన్నలు కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. సంక్షేమ పథకాల విషయంలో కొత్త ఒరబడి సృష్టిస్తున్న రేవంత్.. పార్టీ పరంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయా కులాలకు కార్పొరేషన్లను కేటాయించారు. పదవులు కూడా భర్తీ చేశారు. త్వరలో మిగతా పోస్టులను కూడా భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి అన్నిటిని సెట్ రైట్ చేసుకుంటూ వస్తున్నారు.

దీర్ఘకాల సమస్యగా ఉన్న ఆర్టీసీ కి కొత్త దారిని చూపించారు రేవంత్. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులకు బకాయిలను చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉన్న సమస్యలు మొత్తం అధిగమించాలని అధికారులకు సూచనలు చేశారు. అతి త్వరలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఖాయమని రేవంత్ సంకేతాలు ఇస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలోనూ రేవంత్ ఉదారత చూపిస్తున్నారు. అందువల్లే ఉద్యోగులు ఇటీవల ఆయనను సన్మానించారు. ప్రభుత్వ పరంగా ఉన్న బకాయిలను ప్రతినెల 6వేల కోట్ల చొప్పున చెల్లించేందుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా ఉద్యోగుల సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించారు. పిఆర్సి.. ఇతర సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్ పేర్కొన్నారు. పెరిగిపోయిన అప్పులు.. రాబడి విషయంలో ఏదో అవుతున్న సవాళ్లు.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ రేవంత్ సావధానంగా వెళ్తున్నారు. తన కాళ్లలో పుల్లలు వేస్తున్నప్పటికీ వాటిని ఏరుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే దూకుడు కనక రేవంత్ కొనసాగిస్తే ఖచ్చితంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ని మించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరు తెచ్చుకుంటారని కార్యకర్తలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular