TG Police Department: అతడు ఎమ్మెల్యే కాదు. అధికార పార్టీ నాయకుడు అంతకన్నా కాదు. ఒకరకంగా రాజకీయ దళారి. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ పార్టీ ముఖ్యులతో సంబంధాలు పెంచుకుంటాడు. వారి అవసరాలు తీర్చుతాడు. ఆ తర్వాత రంగ ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత తన టార్గెట్ ఫినిష్ అయ్యేంతవరకు వసూలు చేసుకుంటూనే ఉంటాడు. పై వారి అండదండలు ఉంటాయి కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాడు.
Also Read: అమరావతికి’ నిధుల వరద.. సిఆర్డిఏ సంచలన నిర్ణయం!
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి ఓ పార్టీ వచ్చింది. ఆ పార్టీలో అత్యంత పెద్ద నాయకురాలికి అప్పట్లో ఇతడు సన్నిహితుడుగా మారిపోయాడు. గడచిన పది సంవత్సరాలు దర్జాగా దందా సాగించాడు. పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోవడంతో.. ఒక్కసారిగా తన ప్లేట్ ఫిరాయించాడు. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తికి దగ్గరయ్యాడు. తన దగ్గర ఉన్న నోట్ల కట్టలు విసిరేశాడు. అత్యంత కీలకమైన పోలీస్ శాఖలోకి అడుగు పెట్టాడు. బదిలీలు, పదోన్నతులు, సెటిల్మెంట్లు.. ఇలా ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టాడు. కొందరు డిసిపిలతో హైదరాబాద్ ఏరియాలో ల్యాండ్ సెటిల్మెంట్లు, స్పా సెంటర్లలో వసూళ్లు, క్లబ్బులలో పేకాట శిబిరాలు, పబ్బులలో అసాంఘిక కార్యకలాపాలు.. ఇలా డబ్బుల వసూలుకు అవకాశం ఉన్న ఏ విభాగాన్ని కూడా అతడు వదిలిపెట్టడం లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం అనేది అత్యంత కీలకమైనది. ఇది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికే దిక్సూచి లాంటిది. ఇక్కడ ప్రపంచ స్థాయి కర్మా గారాలు, ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్రమంగా సాగాలి అంటే శాంతిభద్రతలు అవసరం.
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వాలు రాజీ పడితే ఆ ప్రభావం రాష్ట్ర ప్రగతి మీద పడుతుంది. కానీ ఆ విషయాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా మర్చిపోయాడు.. పోలీసులతో అంట కాగుతూ దందాలకు పాల్పడుతున్నాడు. డీసీపీ లతో హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. పబ్బులు, క్లబ్బులలో గబ్బు యవరాలకు పాల్పడుతున్నాడు. వాటి ద్వారా దండిగా సంపాదిస్తున్నాడు. అయితే ఇతడు ప్రభుత్వంలోని పెద్దకు కీలకంగా ఉండడంతో ఎవరు ఏమీ అనలేకపోతున్నారు. ఇతడి ఆగడాలు ఇటీవల కాలంలో మరింత శృతిమించిపోయాయి. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి నివేదిక ఇచ్చాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఆ షాడో వ్యక్తిని ఏం చేస్తుందనేది? చూడాల్సి ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే.. అతడు చేస్తున్న ఆగడాలను అలానే చూస్తూ ఉండిపోతే దాని పర్యవసనాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.