Natural disasters : సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో ప్రకృతి ఒక్కసారిగా పడక విప్పింది. మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హోరుమని గాలులు వచ్చాయి. చూస్తుండగానే వందలాది వృక్షాలు నేలకు కూలిపోయాయి. వర్షాలు విపరీతంగా కురిసాయి. తద్వారా మేడారం పరిసర ప్రాంతాలన్నీ ధ్వంసం అయ్యాయి. ఈ వర్షాన్ని, హోరుగాలిని మర్చిపోకముందే భూకంపం వచ్చింది. భూకంపం తాకిడికి మేడారం సమ్మక్క, సారక్క గద్దెలు ఊగిపోయాయి. ప్రాణ నష్టం చోటు చేసుకోకపోయినాప్పటికీ.. ఆస్తి నష్టం సంభవించకపోయినప్పటికీ భూకంపం మాత్రం ప్రజలను భయకంపితులను చేసింది.
మేడారం సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా.. ఇంకా ఏదైనా దాని వెనక ఉందా.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. మేడారం ఘటన అలా ఉండగానే ఈ సంవత్సరం వర్షాకాలంలో ఇప్పటివరకు దేశంలో అలాంటి ఘటనలు కొన్ని ప్రాంతాలలో చోటుచేసుకున్నాయి. గడచిన నాలుగు నెలల్లో మనదేశంలో పలు ప్రాంతాలలో ప్రకృతి ఒకసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించింది.. బీభత్సమైన గాలులు.. అదే స్థాయి వర్షాలతో ఆ ప్రాంతాలను అతాలకు తలం చేసింది. దాదాపు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 16 వరకు దేశంలో పలు ప్రాంతాలలో చోటుచేసుకున్న భారీ వర్షాల వల్ల ఏకంగా 1297 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రకృతి విపత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 258 మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో 171 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. మధ్యప్రదేశ్లో 148 మంది, బీహార్ రాష్ట్రంలో 101 మరణాలు చోటుచేసుకున్నాయి.. ఇక పశువులయితే దాదాపు 51 699 చనిపోయాయి.. 92,663 గృహాలు దెబ్బతిన్నాయి. దాదాపు 154, 394 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్న ప్రాంతాలలో అటవీ విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. రోడ్లు, ప్రాజెక్టులు, ఇలా రకరకాల వాటి పేరుతో ఆ ప్రాంతాలలో ఉన్న అడవులను ధ్వంసం చేస్తున్నారు.. దీంతో జీవవైవిద్యం క్రమంగా అదుపుతప్పుతోంది. దీంతో ఆ ప్రాంతాలలో ప్రకృతి విపత్తులు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాలలో వర్షాలు, భీకరమైన గాలులు మాత్రమే కాదు భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..” ఈ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఇక్కడ పచ్చటి అడువులు ఉండేవి. ఇప్పుడు అవి మాయమయ్యాయి. జంతువులు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. దీంతో బయోడైవర్సటీ మొత్తం సర్వనాశనమైంది. అందువల్లే ఈ ప్రాంతాలు ప్రకృతి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.. ఈ స్థాయిలో నష్టం జరుగుతోంది అంటే.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని” పర్యావరణాన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.