Kavitha : సస్పెన్షన్ తర్వాత శాసనమండలి సభ్యురాలు కవిత బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఈ సమావేశంలో ఆమె ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఎటువంటి విషయాలు చెబుతారు? అని అందరూ ఉత్కంఠ గా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే కవిత కొన్ని విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ సమావేశంలో కూడా తన తండ్రి కెసిఆర్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొన్న హరీష్ రావు, సంతోష్ రావు మీద ఎటువంటి ఆరోపణలు అయితే చేశారో.. వాటికి కవిత కట్టుబడి ఉన్నారు.. పైగా బుధవారం నాటి సమావేశంలో కూడా వారిద్దరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కవిత..
అందు గురించే మాట్లాడాను
“మే ఒకటి నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా నేను జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాను. ఇంకా సామాజిక తెలంగాణ సాధించుకోలేదని చెప్పాను. 79 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో దళితులకు మూడెకరాల భూమి.. దళితులకు 10 లక్షల నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్. అది కాదా సామాజిక తెలంగాణ అంటే.. భౌగోళిక తెలంగాణ మాత్రమే భారత రాష్ట్ర సమితి నినాదం అవుతుందా.. అలాంటప్పుడు ఈ సామాజిక వర్గాలు ఎక్కడికి వెళ్లాలి.. వీరందరిని ఎవరు పట్టించుకోవాలి. సామాజిక వర్గాలు సంతోషంగా ఉంటేనే కదా తెలంగాణ సుభిక్షంగా ఉండేది. నేను అదే విషయం చెప్పాను. దానిని చిలువలు పలువలుగా కొంతమంది ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులు మొన్న నేను చెప్పిన వారే” అంటూ కవిత విమర్శలు చేశారు.
వారిద్దరింట్లో బంగారం ఉంటే సరిపోతుందా
“కెసిఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అనే నినాదాన్ని తెర పైకి తీసుకొచ్చారు. తెలంగాణ మొత్తం బంగారం లాగా మెరిసిపోవాలని.. విలువైన రాష్ట్రంగా మారిపోవాలని ఆయన కలలు కన్నారు. సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనే.. హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్టు కాదు. నేను ఏ ప్రోగ్రాం చేసినా దానిని భూతద్దంలో పెట్టి చూడడం.. అడ్డగోలుగా మాట్లాడడం.. అడ్డగోలుగా ప్రచారం చేయించడం పెరిగిపోయింది. పార్టీకి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. పార్టీలో కొన్ని సమస్యలున్నప్పుడు చెప్పడం నా బాధ్యత. పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరు కోవర్టులు నామీద దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారిని వదిలిపెట్టేది లేదు. నేను కేసీఆర్ చిటికెన వేలు పట్టుకొని ఉద్యమాన్ని చూసిన దాన్ని. ఉద్యమాలు చేసిన దాన్ని. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు. భౌగోళిక తెలంగాణ తెలుసు. తెలంగాణ సమస్యలు కూడా తెలుసు. ఇవాళ నాకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు. ఇకపై అన్ని చెబుతూనే ఉంటానని” కవిత పేర్కొన్నారు.
వారిద్దరే టార్గెట్
ఈ సమావేశంలో కూడా కవిత ఆ ఇద్దరినే టార్గెట్ చేశారు. వారిద్దరే తనకు ఇబ్బందిగా మారారని.. పార్టీలో కోవర్టులు అంటే వారేనని కవిత ఆరోపించారు. తన తండ్రి చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేశారని కవిత మండిపడ్డారు.. ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని.. అదే విషయాన్ని తాను చెప్పానని.. ఇందులో తప్పు ఏమీలేదని కవిత పేర్కొన్నారు.
హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు..
బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు పన్నాగాలు పన్నుతున్నారు
ఈరోజు నాకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరగొచ్చు
మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న
కేసీఆర్, కేటీఆర్, నేను కలిసి ఉండకూడదని హరీష్ రావు కుట్రలు చేశారు
– కవిత pic.twitter.com/xgTAIZ9RyW
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025