India vs Pakistan : ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. మరీ ముఖ్యంగా భారత జట్టు మీద ఆ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భారత జట్టుతో పాకిస్తాన్ లీగ్ దశలో తలపడింది. ఆ మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్లో విఫలమైంది. బౌలింగ్లో సత్తా చూపించలేకపోయింది. అటువంటి జట్టు బలమైన భారత్ తో తలపడుతోంది అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ సూపర్ 4 మ్యాచ్ లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. బలమైన భారత్ ఒత్తిడికి గురైంది.

ఫీల్డింగ్ లో భారత జట్టు చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అదరగొడుతుంది. అటువంటి జట్టు పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో దారుణంగా ఫీల్డింగ్ చేసింది. బౌలింగ్ విషయంలో కూడా ఉదారంగా పరుగులు ఇచ్చింది. అభిషేక్ శర్మ రెండు క్యాచ్ లు నేలపాలు చేశాడు. కులదీప్ యాదవ్ ఒక క్యాచ్ వదిలేశాడు. గిల్ ఒక క్యాచ్ జార విడిచాడు. తద్వారా పాకిస్తాన్ జట్టుకు ఊహించని జీవధానాలు లభించాయి. వచ్చిన జీవధానాలను పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది. లీగ్ మ్యాచ్లో 121 పరుగులకు ఆల్ అవుట్ అయితే.. సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏకంగా 171 రన్స్ చేసింది. అది కూడా కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. బలమైన భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రారంభం నుంచి చివరి వరకు పరుగుల వేటను జోరుగా సాగించింది. చివరికి గిల్ కూడా ఒక క్యాచ్ ను వదిలేసాడు. దీంతో భారత్ నేలపాలు చేసిన క్యాచ్ ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. వాస్తవానికి భారత్ ఈ స్థాయిలో ఫీల్డింగ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భారత్ ఇబ్బంది పడేంత విధంగా ఒత్తిడి కూడా లేదు. ఒకవేళ ఒత్తిడి ఉంటే పాకిస్తాన్ జట్టు మీద ఉంటుంది. ఎందుకంటే లీగ్ దశలో ఆల్రెడీ పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది. యూఏఈ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇబ్బంది పడింది. పైగా పాకిస్తాన్ ఫీల్డింగ్ చెప్పుకునే స్థాయిలో లేదు. బ్యాటింగ్ కీర్తించే స్థాయిలో లేదు.

అయితే భారత జ ట్టుతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఏ మాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఫర్హాన్ చేసిన 58 పరుగులు పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముక గా నిలిచాయి. చివర్లో వచ్చిన ఆష్రఫ్ 8 బంతుల్లో 20 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టు స్కోరు 171 పరుగులకు చేరుకొంది. లీగ్ మ్యాచ్ తో పోల్చి చూస్తే పాకిస్థాన్ అదనంగా 50 పరుగులు చేసింది. అంతంత మాత్రపు ఆటతీరు కొనసాగిస్తున్న పాకిస్తాన్ భారత ఫీల్డింగ్ లోపం వల్ల అదరగొట్టింది. మరి ఈ లోపాన్ని భారత ఆటగాళ్లు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.