India vs Pakistan : ఆడలేక మద్దెల ఓడు.. అనే సామెత ఎప్పుడైనా మీరు చదివారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతి ఏమో గాని పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం భారత ఓపెనర్ల దూకుడు వల్ల కళ్ళ ముందు 70 ఎం ఎం స్క్రీన్ లో కనిపించింది.

ఆదివారం ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 171 రన్స్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ టార్గెట్ కాపాడుకోవడంలో పాకిస్తాన్ బౌలర్లు విఫలమవుతున్నారు. పిచ్ మీద ఉన్న డ్యూ ను సద్వినియోగం చేసుకోలేక తడబడుతున్నారు. భారత బ్యాటర్ల దూకుడు ముందు తలవంచుతున్నారు. భారత ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ శివతాండవం చేస్తున్నారు. నవరాత్రి సంబరాలను టీమిండియా అభిమానులకు ముందే తీసుకొస్తున్నారు.

వాస్తవానికి టి20 క్రికెట్లో 171 రన్స్ టార్గెట్ అంత ఈజీ కాదు. దీనిని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో తేలిపోయింది. దారుణంగా తలవంచింది.. ఏమాత్రం ఇబ్బంది పెట్టే బంతులు వేయలేక తడబడుతోంది. వాస్తవానికి లోపం బౌలింగ్ లో ఉన్నప్పుడు కచ్చితంగా అనేవాడు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాలి. కానీ అలా కాకుండా పరుగులు తీస్తున్న బ్యాటర్ల మీద చిందులు తొక్కడం అతడి అవివేకానికి నిదర్శనం.

ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిది తేలిపోయాడు. అతని బౌలింగ్లో గిల్ ఊచ కోత కోశాడు. తన బౌలింగ్ అలా మారిపోవడంతో ఆఫ్రిది తల వంపులకు గురయ్యాడు. తనలోపాన్ని సరిదిద్దుకోలేక గిల్ మీద మాటల యుద్ధానికి దిగాడు. కయ్యానికి కాలు దువ్వాడు. గిల్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడంతో మధ్యలో ఎంపైర్ కలగ చేసుకోవాల్సి వచ్చింది. ఆ వివాదం ముగిసిపోగానే.. అభిషేక్ శర్మతో రౌఫ్ కయ్యం పెట్టుకోవాలని చూసాడు.. తన బౌలింగ్లో పరుగుల ప్రవాహం పారిస్తున్న అభిషేక్ శర్మతో గొడవ పెట్టుకున్నాడు. నోరు పారేసుకుంటూ మీది మీదికి వచ్చాడు. మధ్యలో అంపైర్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త తగ్గుముఖం పట్టింది. ఇలా బౌలింగ్ చేయలేక భారత గొడవపడిన పాకిస్తాన్ బౌలర్లను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు దమ్ముంటే బౌలింగ్ ద్వారా చూపించాలని.. నోటితో పని ఏముందని చెబుతున్నారు..