Aakriti Srivastava Inspiring Story: సాధారణంగా పాత్రికేయులు వార్తలు సేకరిస్తుంటారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తుంటారు. ఇక నేటి కాలంలో అయితే మీడియా భజన వ్యవహారం లాగా మారింది కాబట్టి.. పాత్రికేయులకు వారి ధర్మం కంటే.. రాజకీయ పార్టీలకు భాజా కొట్టడమే పనిగా మారిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికి తమ పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. స్వతంత్రంగా.. లేదా ఇతర సంస్థలో పనిచేస్తూ తమ పాత్రికేయ వృత్తికి న్యాయం చేస్తున్నారు.
మీరు చదవబోయే కథనం లో ఈ పాత్రికేయురాలు పూర్తి విభిన్నమైన వ్యక్తి. ఎందుకంటే ఈమె తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే.. ఒక ఊరిని బాగు చేసింది. అది కూడా ఒక ఎడారి కి దగ్గరగా ఉన్న గ్రామాన్ని.. దీనికోసం ఆమె చేసిన కృషి.. ఆమె పట్టుదల ఎంతో మందిని కదిలించింది. గ్రామస్తుల జీవితాన్ని బాగు చేసే విధంగా పాదుకొలిపింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం చేశారు.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం
ఆమె పేరు ఆకృతి శ్రీ వాస్తవ. పేరుపొందిన సంస్థలో పాత్రికేయురాలు. ఆమె గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను ఎక్కువగా వెలుగులోకి తీసుకొస్తూ ఉండేవారు. అలా తన విధి నిర్వహణలో భాగంగా ప్రపంచంలోనే ఎక్కువ జన సాంద్రత ఉన్న థార్ పర్యటించారు. అక్కడ బికనీర్ ప్రాంతంలో ఉన్న బజ్జు అనే గ్రామంలో అనేక పర్యాయాలు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఆరు నెలల పాటు పొలాల దగ్గర ఉంటారు. ఆరు నెలలపాటు ఇంటి దగ్గర ఉంటారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వేల మంది జనాభా. పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పశువులతో సహా తరలిపోతారు. ఇలా వారు వెళ్ళినప్పుడు కొన్ని ప్రభుత్వ పథకాలు.. వారికి అందదు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ వాస్తవ.. అక్కడ ప్రజలకు అవగాహన కల్పించారు. దానికంటే ముందు ఆ గ్రామస్థలు ఆరు నెలల పాటు పొలాలకు వెళ్తున్న తీరు పట్ల ప్రత్యేక కథనాలను రూపొందించారు..
శ్రీ వాస్తవ రూపొందించిన కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి. దీనికి తోడు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి కొంతమేర ఫలితాన్నిచ్చాయి. అయితే బహుళ అనే ఒక సంస్థ ను శ్రీ వాస్తవ రూపొందించారు. ఈమెకు టెక్నో సర్వ్ అనే సంస్థ ప్రోత్సాహం అందించింది. ఈ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు.. గ్రామస్తులకు అందిస్తారు. బజ్జు గ్రామస్తులు తయారుచేసిన వ్యవసాయ ఉత్పత్తులు.. ఒంటె పాలు. ఆహార గింజలు.. ఆవనూనె.. వేరుశనగ నూనె ఇవన్నీ కూడా బహుళ సంస్థ కొనుగోలు చేసి అమ్ముతుంది. ఈ ఉత్పత్తులను బికనీర్.. జై సల్మీర్.. జైపూర్ ప్రాంతాలలో బహుళ సంస్థ అమ్ముతోంది. ఈ సంస్థ ఆర్థికంగా ప్రయోజనం కల్పించడంతో ఈ గ్రామస్తుల ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. కుటుంబాలకు పెద్దదిక్కుగా మారిపోయారు. సేంద్రియ ఉత్పత్తులు.. కోల్డ్ ప్రెస్ డ్ నూనెలు.. ఇంకా రకరకాల గింజలను ఈ సంస్థ విక్రయిస్తోంది. ఆన్లైన్ కేంద్రాలలో కూడా ఈ ఉత్పత్తులు అమ్మకానికి పెట్టారు.
ఒక మామూలు పల్లెటూరులో ఈ స్థాయిలో మార్పులు తీసుకొచ్చింది శ్రీవాత్సవ.. తాను ఒక జర్నలిస్ట్ గానే కాకుండా.. గ్రామస్తుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నడుంబించింది. నాకెందుకు అనుకోకుండా.. వీళ్లంతా నా వాళ్లే అనుకుని ముందడుగు వేసింది. ఫలితంగా బజ్జు గ్రామం నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా కూడా ఒక మహిళ జర్నలిస్టు వల్లే సాధ్యమైంది.
