BRS: అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు.. దేన్నయినా శాసించవచ్చు. అలాంటి అధికారాన్ని పొందడానికి నేతలు ఎంతకైనా తెగిస్తారు. ఇంకెన్ని కుప్పి గంతులైనా వేస్తారు. అసలే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇన్ని పరిణామాల మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారు, ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధంగా ఉన్నవారు.. వారి వారి మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తాయిలాలు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అయితే వీరందరిలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఆ మార్గాలు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ మరోసారి ఖరారైంది.. ఈ క్రమంలో ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నుంచి మరోసారి విజయం సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
గోడ గడియారాలను పంచుతున్నారు. ఆ గడియారాల్లో ‘నవ సూర్యాపేట నిర్మాత మన జగదీశన్న’ అని రాయించి పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, మెడికల్ కాలేజీ, మోడల్ మార్కెట్, ఎస్పీ కార్యాలయం ఫొటోలను కూడా గడియారాల్లో ఉంచి, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు సభ్యుల ద్వారా వాటిని ఇంటింటికీ అందిస్తున్నారు. యువకులను ఆకర్షించేందుకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోసం విగ్రహాలతోపాటు, నగదును కూడా అందిస్తున్నారు.
నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కూడా సుమారు రూ.కోటి విలువైన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దీంతోపాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించి, ప్రైజ్‌మనీని రూ.లక్షగా ఖరారు చేశారు. నల్లగొండ టౌన్‌లోని ఓ ఆలయ నిర్మాణానికి రూ.30 లక్షలను విరాళంగా భూపాల్‌రెడ్డి ప్రకటించినట్లు సమాచారం. ఇక ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి సిద్ధమవుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పలుచోట్ల ఉచితంగా వినాయక విగ్రహాలను అందించారు.
ఇక బీజేపీ నేతలు ‘మోదీ కప్’ పేరిట క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ రూ.లక్ష ప్రైజ్‌మనీ పెట్టారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి.. రైతుల పంట పొలాల్లో డ్రోన్లతో పురుగు మందులను స్ర్పే చేయిస్తున్నారు. రైతు కూలీలకు లంచ్‌బాక్సులు, బ్యాగ్‌లు అందిస్తున్నారు. ఈ స్థానానికి అధికార బీఆర్ఎస్ ఇప్పటికే సిటింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను అభ్యర్థిగా ప్రకటించినా.. అదే పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి విద్యార్థులకు బ్యాగ్‌లు, బూట్లను అందిస్తున్నారు. కాగా, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి.. నియోజకవర్గం పరిధిలో ఎవరైనా మరణిస్తే అందుకు హాజరయ్యే బంధువులకు (సుమారు 200 మంది వరకు) ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. శుభకార్యాలకైతే కిరాణ సామాన్లు, చీరను అందజేస్తున్నారు. అంతేకాకుండా.. రెండు ఫంక్షన్‌హాళ్లను లీజుకు తీసుకుని మరీ.. ప్రజలకు సాధారణ ధరకు అద్దెకు ఇస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ అందజేస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో యువతకు క్యారమ్ బోర్డులు పంపిణీ చేస్తున్నారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల కోసం డబ్బులు అధికంగా అవసరమవుతాయనే ఉద్దేశంతో ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులు తమ ఆస్తులను విక్రయించినట్టు సమాచారం. కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ‘డివిజన్ బాట’ పేరుతో జనంలోకి వెళ్తున్నారు. జిల్లాలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల క్యాంపులు ఏర్పాటు చేశారు. గతంలో పెద్దగా కార్యక్రమాలకు హాజరుకాని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు ప్రతి చిన్న కార్యక్రమానికీ వెళ్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌లో చర్చ జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్థానంలో మరోసారి గెలిచేందుకు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే వినాయక విగ్రహాల కోసం ఆయన రూ.1.20 కోట్లు ఖర్చు చేశారనే చర్చ ఉండగా, తాజాగా తాయిలాల పంపిణీకి తెరలేపినట్టు తెలుస్తోంది. కాగా, జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం సెగ్మెంట్లో రూ.1,210 కోట్లతో కొత్త పనులను మంజూరు చేశారు. కేబుల్ బ్రిడ్జి, మున్నేరు వరద నివారణకు రూ.700 కోట్లతో గోడ నిర్మాణం, చెక్‌డ్యామ్‌లు తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని అధికార పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో దేవాలయాల అభివృద్ధికి, కొత్త నిర్మాణాలకు విరాళాలు అందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. శుభకార్యాలకు హాజరవుతూ బహుమతులను అందిస్తున్నట్టు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రలతో నాయకులు జనం వద్దకు వెళుతున్నారు. కుల సంఘాలు, కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి గడిచిన రెండు నెలల్లోనే దాదాపు రూ.200 కోట్ల మేర పనులకు నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో కేటీఆర్, హరీష్ రావు పర్యటన సందర్భంగా రూ.666 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గద్వాల ఎమ్మెల్యే రూ.5కే భోజనం పేరుతో రాజీవ్ చౌరస్తాలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి ‘మర్రి పదేళ్ల ప్రజా ప్రస్థానం’ పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి ఓటర్లకు ఇప్పటికే ఒక దఫా ‘ప్రెషర్ కుక్కర్’లను అందించారనే చర్చ జరుగుతోంది. ఇక మిగతా అభ్యర్థులు కూడా తమ తమ స్థాయిలో ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The leaders of brs are spending a lot of money to turn the voters towards them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com