BB Patil: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. చేతిలో బెల్లం ఉన్నంత వరకే ఈగలు.. బెల్లం అయిపోతే ఈగలు ఉండవు అన్న చందంగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో గుడ్‌బై చెబుతున్నారు. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగగా, పార్లమెంటు ఎన్నికల వేళ ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్‌ఎస్‌ను వీడారు.
మొన్న పెద్దపల్లి ఎంపీ..
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌నేత నెల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన 2019లో బీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
నిన్న రాములు..
తాజాగా రెండు రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌కు చెందిన బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఢిలీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్ లక్ష్యాన్ని, పేదరిక నిర్ములన కోసం మోదీ చేస్తున్న పని చూసి బీజేపీలో చేరుతున్నానని రాములు తెలిపారు.
నేడు బీబీ.పాటిల్
తాజాగా శుక్రవారం (మార్చి 1న) జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్ కూడా బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చాడు. పార్టీకి గుడ్ బై చెప్పారు. పాటిల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి జాతీయ పార్టీ బీజేపీలో అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరారు.
రేపు ఎవరో..
వరుసగా సిట్టింగ్ ఎంపీలు బీఆర్‌ఎస్‌ను వీడడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఛాలెంజ్ విసిరారు. ఇంకోవైపు బీఆర్‌ఎస్ ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలు కూడా పార్టీ వీడుతారని తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ముందువరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కూడా దొరకరన్న ప్రచారం జరుగుతోంది.